నవదిశ, ఖమ్మం: ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి చెందిన సహజ వనరులైన ఇసుకను అక్రమంగా తరలిస్తూ.... ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం కలిగిస్తూ.. వ్యవస్థీకృత కార్యకలాపాలను కొనసాగిస్తున్న ఇసుక మాఫియాపై రఘునాథ పాలెం పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు.
రఘునాథ పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం నిర్వహించిన వాహన తనిఖీలలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబారుపేట రీచ్ నుండి ఎటువంటి ప్రభుత్వ అనుమతులు, మైనింగ్ పర్మిట్లు, ట్రాన్స్‌పోర్ట్ చలానాలు, ఈ-వే బిల్లులు లేకుండా సుమారు 112 టన్నుల ఇసుకను మూడు లారీల్లో అక్రమంగా తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో నందిగామ, అన్నసాగర్ కు చెందిన పాములపాటి గోపాల్ కృష్ణ , ఉమ్మనేని గోపి , బండ్ల కృష్ణ, దాసరి రామకృష్ణ, బండ్ల రామకృష్ణ అలాగే లారీ డ్రైవర్, యజమానిపై కఠిన చర్యలు తీసుకునీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇసుక రవాణాకు ఉపయోగించిన మూడు లారీలు ఎస్కార్ట్ వాహనంగా వినియోగించిన కారు, విక్రయాల కోసం ఉపయోగిస్తున్న వాహనాలని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో నిందితులు ఆంధ్రప్రదేశ్‌లో తక్కువ ధరకు ఇసుకను కొనుగోలు చేసి, ఖమ్మం, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయించి అక్రమ లాభాలు పొందుతున్నట్లు అంగీకరించారు.
ఈ సందర్భంగా నిందితుల నేర చరిత్రను పరిశీలించగా, పాములపాటి గోపాల్ కృష్ణ పై మొత్తం 12 క్రిమినల్ కేసులు తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల్లో నమోదై ఉండగా, వాటిలో పలు కేసుల్లో శిక్షలు కూడా విధించబడ్డాయి. దాసరి కృష్ణ పై నమోదైన ఈ కేసుతో కలిపి మొత్తం 4 కేసులు ఆంధ్రప్రదేశ్ నమోదైనట్లు దర్యాప్తులో వెల్లడైంది. గతంలో కూడా అక్రమ ఇసుక రవాణా, దొంగతనం, మోసం వంటి నేరాల్లో వీరు ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు.
రఘునాథ పాలెం పోలీసుల కఠిన హెచ్చరిక... అక్రమ ఇసుక తవ్వకం, రవాణా, నిల్వ, కొనుగోలు లేదా విక్రయాలలో పాల్గొనే వ్యక్తులు, వాహన యజమానులు, డ్రైవర్లు, సహకరించే మధ్యవర్తులు ఎవరైనా సరే చట్టం ముందు తప్పించుకోలేరు. ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించే, పర్యావరణాన్ని దెబ్బతీసే ఇటువంటి కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా, వాహనాలను స్వాధీనం చేసుకోవడం, హిస్టరీ షీట్లు తెరవడం, పునరావృత నేరస్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం వంటి చర్యలు కచ్చితంగా అమలు చేయబడతాయి.
ప్రజలు కూడా అక్రమ ఇసుక రవాణా లేదా వ్యాపారం గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేసి చట్ట పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఖమ్మం పోలీసులు విజ్ఞప్తి చేశారు. చట్టాన్ని ధిక్కరించే వారికి కఠిన శిక్షలు తప్పవు. అక్రమ ఇసుక రవాణా ఏ రూపంలోనైనా సహించమని స్పష్టం చేశారు.

