నవదిశ, తెలంగాణ బ్యూరో: జగిత్యాల జిల్లా, గొల్లపల్లి మండలం, అబ్బాపూర్ గ్రామం ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్యను పెంచడం లక్ష్యంగా గ్రామపంచాయతీ పాలకవర్గం ఒక కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ నిర్ణయానికి గ్రామస్థుల నుండి పూర్తి మద్దతు లభించింది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం విద్యార్థులను తీసుకెళ్లేందుకు గ్రామానికి వచ్చిన పలు ప్రైవేట్ పాఠశాలల బస్సులను గ్రామస్థులు ఊరి వెలుపలే నిలిపివేశారు. తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపే ప్రసక్తి లేదని వారు స్పష్టం చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లేందుకు సిద్ధమైన కొందరు విద్యార్థులను తల్లిదండ్రులకు నచ్చజెప్పి ప్రభుత్వ పాఠశాలకు తీసుకెళ్లి అక్కడ హాజరయ్యేలా చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామస్థులు, తల్లిదండ్రులతో ప్రజాప్రతినిధులు మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన విద్యా సదుపాయాలు, ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి వారికి వివరించారు. ప్రభుత్వ విద్యాభివృద్ధికి గ్రామంలోని ప్రతి కుటుంబం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అబ్బాపూర్ గ్రామం తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ విద్య పరిరక్షణకు ఒక ఆదర్శంగా నిలుస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

