నవదిశ: తెలంగాణ బ్యూరో:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం చారిత్రాత్మక మైలురాళ్లను అధిగమిస్తూ, రికార్డు స్థాయి పాలనతో ముందుకు సాగుతోందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఈరోజు శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఎంపీ.. 2047 నాటికి భారతదేశాన్ని ‘వికసిత్ భారత్’గా నిలపాలనే సుదూర లక్ష్యంతో ప్రధాని మోదీ ముందుకు సాగుతున్నారన్నారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని మోదీ నిరంతరం శ్రమిస్తున్నారని, ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల వల్లే భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతోందన్నారు. దేశ రక్షణకు పెద్దపీట వేస్తూ ఉగ్రవాదుల పట్ల ఉక్కుపాదం మోపుతోందని డికె అరుణ అన్నారు.
ప్రధాని మోదీ హయాంలో అమలవుతున్న విప్లవాత్మక సంక్షేమ పథకాలు, చారిత్రాత్మక నిర్ణయాలను ఆమె ప్రస్తావించారు. స్వచ్ఛ భారత్, జన్ ధన్ యోజన, జీఎస్టీ అమలు, త్రిపుల్ తలాక్ రద్దు, ఆర్టికల్ 370 రద్దు వంటి సాహసోపేత నిర్ణయాలతో దేశ ముఖచిత్రమే మారిపోయిందన్నారు. మహిళా సాధికారతకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. 2030 నాటికి దేశంలో 3 కోట్ల మంది మహిళలను ‘లఖ్‌పతి, కరోడ్‌పతి దీదీలు’గా మార్చడమే లక్ష్యంగా ప్రధాని విజన్‌తో పనిచేస్తున్నారని తెలిపారు. పీఎం కిసాన్, సుకన్య సమృద్ధి వంటి పథకాలు ప్రజల్లో ఎంతో భరోసానిచ్చాయన్నారు. ముఖ్యంగా రైతులకు ఎరువుల రూపంలో ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.24 వేల వరకు భారీ రాయితీ అందుతోందని డికె అరుణ తెలిపారు.

