నవదిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఈగిల్ ఫోర్స్‌కు చెందిన ప్రాంతీయ ఆర్‌ఎన్‌సీసీ నిజామాబాద్ బృందం వారం రోజుల పాటు సాగించిన నిఘా ఫలితంగా మంగళవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం సర్వర్‌గావ్ తండాలోని గండిమిసమ్మ ఆలయం వద్ద 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసింది. పోలీసుల వివరాల ప్రకారం పరారీలో ఉన్న గణపతి ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏఓబీ) ప్రాంతంలో కిలో గంజాయిని రూ.9 వేల చొప్పున కొనుగోలు చేసి రైలులో తరలించాడు. అనంతరం జుక్కల్‌కు చెందిన మాజీ సర్పంచ్ పవార్ రామారావుకు కిలోకు రూ.15 వేల చొప్పున విక్రయించగా, అతను మరింత అధిక ధరలకు వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.
గణపతి తన కుమారుడు పవార్ శ్రావణ్ ద్వారా 22 కిలోల గంజాయిని ఐదు ప్యాకెట్లలో పంపించగా, వాటిని రామారావుకు అప్పగిస్తున్న సమయంలో ఆర్‌ఎన్‌సీసీ నిజామాబాద్ సిబ్బంది దాడి చేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.11 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితులు పవార్ రామారావు, ముల్గే బాబు, పవార్ శ్రావణ్ లను అరెస్ట్ చేసి నిధులతో పాటు స్వాధీనం చేసుకున్న గంజాయిని జుక్కల్ పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న గణపతి కోసం గాలింపు కొనసాగుతోందన్నారు.

