తెలంగాణ

ఎక్సైజ్ అధికారిపై ఎసిబి కొరడా..

ఎక్సైజ్ అధికారిపై ఎసిబి కొరడా..

నవదిశ, తెలంగాణ బ్యూరో :నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి కొమ్మూరి మల్లారెడ్డిని ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలపై అవినీతి నిరోధక చట్టం కేసు నమోదు చేసింది. దీనికి అనుగుణంగా మంగళవారం ఏకకాలంలో ఆయన నివాసంతో సహా 11 చోట్ల భారీ సోదాలు నిర్వహించింది. కొమ్మూరి మల్లారెడ్డి తన సర్వీస్ కాలంలో అవినీతి పద్ధతులు, అనుమానాస్పద మార్గాల ద్వారా తెలిసిన ఆదాయ వనరులకు అసమానంగా ఆస్తులు సంపాదించారని అధికారులు గుర్తించారు. ఏసిబి బృందాలు ఉదయం నుంచి ఆయన నివాసంతో పాటు ఆయన బంధువులు, బినామీలు, ఇతర అనుచరులకు చెందిన మొత్తం 10 ఇతర ప్రదేశాల్లో ఏకాలంలో సోదాలు నిర్వహించాయి.

ఈ సోదాల్లో దాచిపెట్టిన ఆస్తుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. నాలుగు నివాస గృహాలు, ఒక కమర్షియల్ బ్లాక్, ఎనిమిది ఓపెన్ ప్లాట్లు, 10.23 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తించారు. ఈ స్థిరాస్తుల మార్కెట్ విలువ డాక్యుమెంట్లలో చూపిన విలువ కంటే అనేక రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఏసిబి అంచనా వేసింది. దీంతో పాటు సుమారు రూ. 3.31 లక్షల నగదు లభ్యమైంది. వివిధ బ్యాంకుల్లో రూ. 50 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ గుర్తించారు. మల్లారెడ్డితో పాటు ఆయన భార్య, కుటుంబ సభ్యుల పేరిట 3 బ్యాంక్ లాకర్లు ఉన్నట్లు తేలింది. వాటిని తదుపరి విచారణలో తెరిచి పరిశీలించనున్నారు. దీంతో పాటు ఒక గ్రాండ్ విటారా కారు, ఒక టివిఎస్ స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో గుర్తించిన ఆస్తుల ప్రస్తుత విలువ సుమారు రూ. మూడు కోట్లుగా ప్రాథమికంగా లెక్కించగా, మార్కెట్ విలువ అధికంగా ఉంటుందని ఏసిబి అధికారులు పేర్కొన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్ తరలించినట్లు తెలిపారు.