తెలంగాణ

తెలంగాణలో ముంచెత్తిన వర్షం

తెలంగాణలో ముంచెత్తిన వర్షం

నవదిశ, తెలంగాణ బ్యూరో: గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉత్తర, తూర్పు, మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్ర ప్రణాళికా సంఘం గణాంకాల ప్రకారం పలు జిల్లాల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో రాత్రి వేళల్లో భీభత్సమైన వర్షాలు కురిశాయి. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలోని శ్రీరాంపూర్‌లో రాత్రికి రాత్రే ఏకంగా 173 మి.మీ అత్యంత భారీ వర్షపాతం నమోదైంది.

హైదరాబాద్‌లో అర్ధరాత్రి ‘భారీ’ వాన: మంగళవారం తెల్లవారుజామున భాగ్యనగరంలో వాన దంచికొట్టింది. ముఖ్యంగా పశ్చిమ, దక్షిణ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ కుంభవృష్టి కారణంగా రోడ్లన్నీ జలమయమై, వరద నీరు ఇళ్లలోకి చేరింది. నగరంలోని మిగతా ప్రాంతాల్లో మధ్యస్థం నుండి భారీ వర్షం కురవగా, ఈశాన్య హైదరాబాద్‌ పరిధిలో తేలికపాటి నుండి మధ్యస్థ వర్షాలు పడ్డాయి.

నగరంలోని పలు ప్రాంతాల్లో కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే 100 నుండి 130 మి.మీ వరకు భారీ వర్షం కురిసింది. చందానగర్, మియాపూర్, శేరిలింగంపల్లి, కొండాపూర్, రాజేంద్రనగర్, శంషాబాద్ ప్రాంతాల్లో అకస్మాత్తుగా కురిసిన ఈ భారీ వర్షాల కారణంగా నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించింది. జీహెచ్‌ఎంసీ , విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తొలగించే చర్యలు చేపట్టాయి. ప్రజలు అనవసరంగా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.