తెలంగాణ

మాదక ద్రవ్యాల ఉచ్చులో పడోద్దు: ఏసీపీ రమణమూర్తి

మాదక ద్రవ్యాల ఉచ్చులో పడోద్దు: ఏసీపీ రమణమూర్తి

నవదిశ, ఖమ్మం : మాదక ద్రవ్యాల ఉచ్చులో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి అన్నారు. జూన్ 26 న నిర్వహించే అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా జైలులో గురువారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో టౌన్ ఏసీపీ పాల్గొని మాట్లాడుతూ..ఖైదీలకు మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలు, దుష్పరిణామాలు వాటి నుంచి విముక్తి పొందే మార్గాలపై అవగాహన కల్పించడం చాలా ముఖ్యమన్నారు. జైలు జీవితం నుండి బయటపడిన తర్వాత ఆరోగ్యకరమైన, నేరరహిత జీవితాన్ని గడపడానికి కౌన్సెలింగ్ అవసరమన్నారు.

ముఖ్యంగా చెడు స్నేహాల వల్ల లేదా పరిస్థితుల ప్రభావంతో తాత్కాలిక ఆనందం కోసం గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటుపడితే అనేక రుగ్మతల భారిన పడతారన్నారు. ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ పై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలు కలిగి ఉండడం, సేవించడం, సరఫరా చేయడం, తయారీ, క్రయవిక్రయాలు అన్నీ క్రిమినల్‌ నేరాలని.. కఠినశిక్షలు తప్పవని సూచించారు.మాదకద్రవ్యాలకు అలవాటు పడిన వాళ్లు వాటి నుంచి విముక్తి కోసం స్వయంగా ముందుకు వస్తే వారిపై ఎలాంటి నేర విచారణా ఉండదన్నారు. ఉచితంగా వైద్య సహాయం అందిస్తామన్నారు.

కార్యక్రమంలో జైలు సూపరిండెంట్ శ్రీధర్, ఇన్స్పెక్టర్ భానుప్రకాష్, జైలర్ సక్రూ, తదితరులు పాల్గొన్నారు.