నవదీశ నల్గొండ:
యుటిఎఫ్ భవన్ లో టీఎస్ యుటిఎఫ్ నల్లగొండ జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పూర్వ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ...యుటిఎఫ్ కార్యకర్తలు ప్రభుత్వ బడులలో విద్యార్థుల నమోదు పెంచడానికి కృషి చేయాలని కోరారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేడు పాలనలో మరియు ప్రతిపక్షంలో ఉన్న మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రభుత్వ బడుల మూసివేత పై నోరు మెదపడం లేదని ఆరోపించారు. పారిశ్రామీకీకరణ పట్టణీకీకరణ మూలంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువదంపతుల వలసలతో నగరాలలో పెరిగిన జనాభాకు అనుగుణంగా నేడు ప్రభుత్వ బడులు లేవని, జనాభా పెరుగుదలకు అనుగుణంగా నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, నకిరేకల్, చండూరు లాంటి పట్టణ ప్రాంతాలలో ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ బడులు ఏర్పాటు చేయాలని వారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. నల్లగొండ పట్టణంలో 44 వేల మంది విద్యార్థులు చదువుతుండగా అందులో కేవలం ఒక 5,000 మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారని, నల్లగొండ పట్టణంలో బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసిన విధంగానే కేశరాజు పల్లి, రామగిరి, జేబీఎస్, అక్కలాయి గూడెం పాఠశాల అభివృద్ధి చేస్తే పట్టణ ప్రాంతంలో ఆర్థికంగా వెనకబడిన ఎంతో మందికి, మధ్య తరగతి వర్గానికి సౌకర్యంగా ఉంటుందని అందుకు స్థానిక మంత్రి చొరవచూపాలని కోరారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో టీఎస్ యుటిఎఫ్ ముందంజలో ఉంటుందని ఎల్లవేళలా ఉపాధ్యాయుల పక్షాన పోరాటం చేస్తుందని, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెంచి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి టీఎస్ యుటిఎఫ్ కార్యకర్తలు ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పూర్వ కార్యదర్శి జి నాగమణి, ఎడ్ల సైదులు జిల్లా ఉపాధ్యక్షులు నర్రా శేఖర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు జి అరుణ, జిల్లా కార్యదర్శులు గేర నరసింహ, శ్రీనివాస్ రెడ్డి, నలపరాజు వెంకన్న, భాను ఆడిట్ కమిటీ సభ్యులు భాను ప్రకాష్, మధుసూదన్ వివిధ కమిటీల కన్వీనర్లు పగిడిపాటి నరసింహ, ప్రభాకర్, బి.సురేందర్ రెడ్డి, ఎరనాగుల సైదులు, శ్యాం కుమార్, శ్రీలత, వరలక్ష్మి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

