నవదిశ,నల్గొండ: జిల్లాలోని తెలంగాణ కాలనీలో కలకలం రేపిన నాలుగు హత్యల కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. ఆస్తి కోసం కన్నకూతురు, అల్లుడే ఈ ఘోరానికి ఒడిగట్టినట్లు విచారణలో తేలింది. సొంత కూతురికి ఆస్తి దక్కదనే కక్షతో సుపారీ ఇచ్చి ఈ దారుణ ఘాతుకానికి పాల్పడ్డారు. గతంలో ఇదే ఇంట్లో జరిగిన దొంగతనం వెనుక కూడా వీరి హస్తమే ఉందని విచారణలో స్పష్టమైంది. ప్రస్తుతం నిందితులు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కిరాయి హంతకులతో ఈ దాడి చేయించారు. మొదట సుల్తాన్ అనే వ్యక్తిని చంపిన దుండగులు ఆ తర్వాత హసీనాను హతమార్చారు. తల్లిదండ్రులను కళ్ల ముందే చంపుతుండటంతో భయాందోళనలకు గురైన ఇద్దరు పిల్లలు మంచం కింద దాక్కున్నారు. అయినా హంతకులు వదల్లేదు. మంచం కింద ఉన్న ముజామీల్ అనే బాలుడి కడుపులో 14 సార్లు కత్తితో పొడిచి కిరాతకంగా చంపేశారు. చివరగా మిగిలిన 13 ఏళ్ల చిన్నారి అప్సర తనను చంపవద్దంటూ హంతకుల కాళ్లు పట్టుకుని ప్రాధేయపడింది. అయినప్పటికీ ఏమాత్రం జాలి లేకుండా ఆ పాపను కూడా అతి దారుణంగా నరికేశారు. ఇలా ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని ఈ దుర్మార్గులు వరుసగా పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన అనంతరం నిందితులు ఇంటి గేటుకు తాళం వేసి అక్కడి నుండి పరారయ్యారు. రక్తం పంచుకు పుట్టారనే బంధాలను మరిచి ఆస్తి పిచ్చితో కూతురు, అల్లుడు చేసిన ఈ దారుణం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

