నవదిశ, తెలంగాణ బ్యూరో :
నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం శర్భాపురం ఎంపీపీఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న బెక్కం వీరయ్యపై జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఉద్యోగ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు చిట్టీల వ్యాపారం నిర్వహిస్తు మోసాలకు పాల్పడుతున్నాడని చింతపల్లి మండలం కుర్మపల్లి పాఠశాలకు చెందిన ఒక ఉపాధ్యాయుడు ఇచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో విచారణ జరిపిన అధికారులు ఆరోపణలు నిజమని నిర్ధారించారు.
రూ.20 లక్షల చిట్టీ వ్యవహారంపై ఫిర్యాదులు
బెక్కం శ్రేయస్ తండ్రి బెక్కం వెంకటయ్య, ప్రధానోపాధ్యాయుడు నిర్వహించిన రూ.20 లక్షల చిట్టీలో సభ్యుడిగా ఉండి చెల్లింపుల విషయంలో అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో మూడు విడతలుగా ఫిర్యాదులు సమర్పించారు. ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రెండో ఫిర్యాదు అనంతరం చండూరు ఆర్డీవోను విచారణ అధికారిగా నియమించారు. ఆర్డీవో నిర్వహించిన సమగ్ర విచారణలో, ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తూనే చిట్టీల వ్యాపారం నిర్వహించినట్లు నిర్ధారణ అయింది.
డీఈఓ షోకాజ్ నోటీసు.. అనంతరం సస్పెన్షన్
ఆర్డీవో నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనిపై జిల్లా విద్యాధికారి (డీఈఓ) గత నెల 11వ తేదీన 1 షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ కోరగా, సమర్పించిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో ఈనెల ఆరవ తేదీన సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ సేవా నియమాల ఉల్లంఘనపై విమర్శలు
గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ ప్రభుత్వ సేవా నియమాలను ఉల్లంఘించి ప్రైవేటు చిట్టీల వ్యాపారం నిర్వహించడం తీవ్రంగా ఖండించదగిన విషయమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సేవా నియమాలను పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని పలువురు పేర్కొన్నారు.
నాంపల్లి ఎంఈఓ వివరణ
ఉపాధ్యాయ వృత్తిలో ఉండి అక్రమంగా చిట్టీ ల వ్యాపారం నడుపుతున్నాడని ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల మేరకు కలెక్టర్ చండూరు ఆర్డీవోను సోషల్ ఆఫీసర్ గా నియమించడం జరిగింది, ఆర్డీవో సమర్పించిన సమగ్ర విచారణతో కలెక్టర్ ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

