నవదిశ, తెలంగాణ బ్యూరో: ఏపీలో ఎస్ఐఆర్ ప్రక్రియలో అత్యంత కీలకమైన ఇంటింటి సర్వే సోమవారం నేడు జూన్ 15 నుండి అధికారికంగా ప్రారంభం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జులై 14 వరకు నెల రోజుల పాటు ఈ సర్వే నిరంతరాయంగా సాగనుంది. ఇందులో భాగంగా మొత్తం 46,397 మంది బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వో) ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను ప్రత్యక్షంగా కలవనున్నారు. ఇందుకోసం ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4.16 కోట్ల మంది ఓటర్ల కోసం ప్రత్యేకంగా ఎన్యుమరేషన్ ఫామ్‌లను ముద్రించింది. ఈ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు బీఎల్‌వోలకు ఈసీ ఇప్పటికే ప్రత్యేక శిక్షణను కూడా పూర్తి చేసింది.
సర్వేలో ప్రతి ఓటరుకూ రెండు ఎన్యుమరేషన్ ఫాంలను అందజేస్తారు. వీటిలో ఓటరు పేరు, ఫొటో గుర్తింపుకార్డు (EPIC) నంబరు, చిరునామాతో పాటు పాత ఫొటో ముద్రించి ఉంటాయి. మిగిలిన వివరాలను ఓటర్లే స్వయంగా నింపాల్సి ఉంటుంది, అవసరమైతే బీఎల్‌వోలు ఇందుకు సహకరిస్తారు. నెల రోజుల వ్యవధిలో ఫాంలు ఇవ్వడానికి, నింపిన వాటిని తిరిగి తీసుకోవడానికి బీఎల్‌వోలు ప్రతి ఇంటికీ మూడుసార్లు వస్తారు. 2002 నాటి ఓటర్ల జాబితాను ప్రాతిపదికగా తీసుకుని ప్రస్తుత జాబితాతో మ్యాపింగ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 4.16 కోట్ల మంది ఓటర్లలో ఇప్పటికే 2.68 కోట్ల మందికి (64.6%) మ్యాపింగ్ పూర్తయింది. మిగిలిన 1.47 కోట్ల మంది వివరాలను ఈ సర్వే ద్వారా సేకరిస్తారు. 2002 జాబితాలో ఓటరు పేరు గానీ, లేదా వారి కుటుంబ సభ్యుల పేర్లు గానీ ఉంటే ఆ వివరాలను ఫాంలో నమోదు చేయాలి. వీటితో పాటు ఆధార్, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నింపి కొత్త కలర్ ఫొటో అతికించి ఇవ్వాలి. రెండు ఫాంలలో ఒకదానిపై బీఎల్‌వో సంతకం చేసి రసీదుగా ఓటరుకు ఇస్తారు, దీన్ని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. ఒకవేళ ఎవరైనా ఓటరు అందుబాటులో లేకపోతే, ఇంటి పెద్ద లేదా కుటుంబ సభ్యులు వారి తరఫున సంతకం చేసి ఫోరం సమర్పించవచ్చు.

