నవదిశ, ఆంధ్రప్రదేశ్ : కలియుగ వైకుంఠమైన తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రక్షణ మరియు భద్రతను మరింత బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ కీలక అడుగు వేసింది. శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే లక్షలాది మంది భక్తుల రక్షణే ధ్యేయంగా పోలీసు శాఖకు చెందిన ప్రత్యేక విభాగం ‘ఆక్టోపస్’ తిరుమల కొండపై ఒక భారీ మాక్ డ్రిల్ నిర్వహించింది. అధునాతన ఆయుధాలు, గన్స్‌తో రంగంలోకి దిగిన ఆక్టోపస్ బలగాలు కొండపై అసాధారణ రీతిలో భద్రతా తనిఖీలు చేపట్టాయి.
ఈ ప్రత్యేక మాక్ డ్రిల్‌లో ప్రధానంగా అవాంఛనీయ లేదా ప్రమాదకర పరిస్థితులు ఎదురైనప్పుడు, అలాగే ఒకవేళ ఉగ్రవాద దాడులు వంటివి జరిగినప్పుడు భద్రతా బలగాలు ఏ విధంగా స్పందించాలనే అంశాలపై విస్తృతంగా ప్రాక్టీస్ చేశారు. ఆ సమయంలో తిరుమలకు వచ్చే సాధారణ భక్తులకు ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా, వారిని అత్యంత సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలించి కాపాడాలనే వ్యూహాలపై ఆక్టోపస్ దళాలు అభ్యాసం చేశాయి. తిరుమల కొండపై కంటికి రెప్పలా భద్రతను పెంచేందుకు నిర్వహించిన ఈ ప్రత్యేక తనిఖీల్లో దాదాపు 50 మంది రక్షణ సిబ్బంది ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అనుకోని అత్యవసర పరిస్థితులు తలెత్తితే ఎంత వేగంగా, సమర్థవంతంగా స్పందించి పరిస్థితిని అదుపులోకి తేవచ్చో ఈ డ్రిల్ ద్వారా సిబ్బంది చేసి చూపించారు.

