ఆంధ్రప్రదేశ్

తిరుమల శ్రీవారి ప్రసాదాల నాన్యారే చెకింగ్ కోసం టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి ప్రసాదాల నాన్యారే చెకింగ్ కోసం టీటీడీ కీలక నిర్ణయం

నవదిశ, అమరావతి:

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రసాదాల నాణ్యత మరియు పవిత్రతను మరింత పెంచేందుకు.. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది!

బెంగళూరులో జరిగిన ప్రతిష్టాత్మక 'రైజ్ కాన్‌క్లేవ్ 2026' వేదికగా.. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో ఒక కీలక అవగాహనా ఒప్పందం కుదిరింది. దేశంలోనే ప్రముఖ ఆహార పరిశోధనా సంస్థ అయిన మైసూర్ లోని ‘సీఎస్ఐఆర్ - సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’ (CSIR-CFTRI) తో టీటీడీ ఈ కీలక ఒప్పందంపై సంతకాలు చేసింది.

ఈ ఒప్పందం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.. శ్రీవారి ప్రసాదాల సాంప్రదాయకత, పవిత్రతకు ఎలాంటి భంగం కలగకుండా.. వాటి పోషక విలువలను, ఆహార భద్రతను శాస్త్రీయ పద్ధతుల్లో మరింత బలోపేతం చేయడమేనని, ఈ భాగస్వామ్యంతో.. ముడిసరుకుల కొనుగోలు, నిల్వ, ప్రసాదాల తయారీ నుండి పంపిణీ వరకు ప్రతి దశలోనూ కఠినమైన నాణ్యత నియంత్రణ ప్రమాణాలను (SOPs) అమలు చేయబోతున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు.

ముఖ్యంగా శ్రీవారి లడ్డూకు వాడే నెయ్యి స్వచ్ఛతను పరీక్షించడం, ప్రసాదం యొక్క అసలైన రుచి, సువాసన అస్సలు మారకుండా చూసుకోవడంపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. అంతేకాదు.. లడ్డూలు ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా (షెల్ఫ్-లైఫ్ పెంచేందుకు) సరికొత్త ప్యాకేజింగ్ విధానాలపై పరిశోధనలు చేయనున్నారు. అదనంగా, టీటీడీ ఆహార సిబ్బందికి, ల్యాబ్ విశ్లేషకులకు ఈ సీఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు అధునాతన సాంకేతికతలపై ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నారు.

ప్రపంచవ్యాప్తంగా వచ్చే కోట్లాది మంది భక్తులకు అత్యంత సురక్షితమైన, నాణ్యమైన, దివ్యమైన సాంప్రదాయ ప్రసాదాలను అందించేందుకు ఈ సరికొత్త శాస్త్రీయ భాగస్వామ్యం ఎంతగానో దోహదపడుతుందని టీటీడీ వెల్లడించింది.