నవదిశ, భూపాలపల్లి : ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డు కారల్ మార్క్స్ కాలనీ, 4వ వార్డు రాజీవ్ నగర్ కాలనీలలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి బూతు స్థాయి అధికారులు వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేసి, ఓటర్లకు అవసరమైన అవగాహన కల్పించాలని సూచించారు. ఓటర్లు సమర్పించిన ఫారాలను ఎప్పటికప్పుడు డేటా ఎంట్రీ చేసి నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన బీఎల్‌ఏలను భాగస్వామ్యం చేయాలని, ప్రక్రియ పారదర్శకంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే గ్రామాలు, మున్సిపాలిటీ పరిధిలో ప్రతి రోజు చెత్త సేకరణ వాహనాల ద్వారా చాటింపు నిర్వహిస్తూ ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీరాజయ్య జీపీఓ కిరణ్, ఎన్యూమరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

