తెలంగాణ

టీజీ20 పరుగుల సునామీ.. తిలక్ విధ్వంసకర సెంచరీలు

టీజీ20 పరుగుల సునామీ.. తిలక్ విధ్వంసకర సెంచరీలు

నవదిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న టీజీ20 క్రికెట్ లీగ్‌లో పరుగుల వరద పారింది. భారత స్టార్ బ్యాటర్, మెదక్ ఫాల్కన్స్ కెప్టెన్ తిలక్ వర్మ అసాధారణ పోరాటపటిమతో వరంగల్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. వరంగల్ నిర్దేశించిన 259 పరుగుల భారీ లక్ష్యాన్ని మెదక్ ఫాల్కన్స్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్ల తేడాతో ఛేదించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బ్యాటర్లు సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డారు. మొదట బ్యాటింగ్ చేసిన వరంగల్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 258 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ జట్టు బ్యాటర్ అమన్ రావు పేరాల కేవలం 48 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్సర్లతో 142 పరుగులు చేసి వరంగల్‌కు కొండంత స్కోరును అందించాడు. అనంతరం కఠినమైన లక్ష్యంతో బరిలోకి దిగిన మెదక్ జట్టులో కెప్టెన్ తిలక్ వర్మ ఒంటరి పోరాటం చేశాడు. భారత ‘ఏ’ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ ట్రై సిరీస్ గెలిపించిన తిలక్.. సోమవారం ఉదయమే హైదరాబాద్ చేరుకుని వెంటనే ఈ మ్యాచ్‌లో పాల్గొనడం విశేషం. మిగిలిన బ్యాటర్లు విఫలమైనా, తిలక్ మాత్రం పట్టుదలతో ఆడి 56 బంతుల్లో 136 పరుగులు చేసి చివరి వరకు నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. సోమవారం జరిగిన మరో పోరులో నల్గొండ నైట్స్‌పై రంగారెడ్డి రైజర్స్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన నల్గొండ నిర్ణీత ఓవర్లలో 189 పరుగులు చేయగా, రంగారెడ్డి రైజర్స్ ఆ లక్ష్యాన్ని 16.3 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. రంగారెడ్డి జట్టులో తనయ్ త్యాగరాజ్ 71 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించాడు.