తెలంగాణ

భూ దస్తావేజుల ముఠా గుట్టురట్టు - 4 గురు అరెస్ట్

భూ దస్తావేజుల ముఠా గుట్టురట్టు - 4 గురు అరెస్ట్

నవదిశ, తెలంగాణ బ్యూరో:

కోకాపేట-నార్సింగి కారిడార్‌లో నకిలీ భూ దస్తావేజుల ముఠా గుట్టురట్టు - పీవీ కుటుంబరావు కుటుంబానికి చెందిన భూమిపై నకిలీ సేల్ డీడ్స్--4 గురు అరెస్ట్

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి కోకాపేట-నార్సింగి గ్రోత్ కారిడార్‌లోని బృందావన్ కాలనీ, సర్వే నం.146లో విలువైన ఖాళీ స్థలాలపై నకిలీ దస్తావేజుల ముఠా బాగోతం బయటపడింది. దివంగత పి.వి. కుటుంబరావు కుటుంబానికి చెందిన ఈ భూమిపై ULC అథారిటీకి, వారసులకు మధ్య హైకోర్టులో సివిల్ వివాదం నడుస్తోంది. కోర్టు వివాదాన్ని ఆసరాగా చేసుకుని ముఠా 1960-70 నాటి పాత లింక్ డాక్యుమెంట్లు సృష్టించి, కుటుంబ సభ్యులే అప్పట్లోనే విక్రయించినట్లు నకిలీ సేల్ డీడ్స్ తయారు చేసింది. స్థానిక నివాసి ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు దర్యాప్తు చేపట్టగా నకిలీ రిజిస్ట్రేషన్ల దందా వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో విజయవాడ జిల్లా మాకినేని శివ శంకర ప్రసాద్, తెనాలికి చెందిన కమ్మేల శ్రీనివాసరావు, హైదరాబాద్ లోని కూకట్పల్లికి చెందిన నల్లం ఆదినారాయణ, విజయవాడకు చెందిన మజ్జి నరేష్ లను పోలీసుల అరెస్టు చేశారు. నిందితులు అంతరాష్ట్ర ముఠాగా ఏర్పడి ప్లాట్లుగా విక్రయించేందుకు ఏజెంట్ల ద్వారా కొనుగోలుదారులను ఆకర్షించారని పోలీసులు తెలిపారు. మరో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. అరెస్టైన వారిని కోర్టు ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. 20కి పైగా కేసులు నార్సింగి, గండిపేట పరిసరాల్లో ప్రభుత్వ, వివాదాస్పద ప్రైవేట్ భూములను టార్గెట్ చేస్తూ నకిలీ దస్తావేజుల నెట్‌వర్క్ నడుస్తోందని పోలీసులు గుర్తించారు. గత కొన్ని నెలల్లో నార్సింగి పరిధిలో ఇలాంటి కేసులు 20కి పైగా నమోదు కాగా, 30 మందికి పైగా అరెస్ట్ అయ్యారని పోలీసులు వెల్లడించారు. నకిలీ డాక్యుమెంట్లు ఎలా సృష్టించారు, రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన వారి ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు టెక్నికల్, లీగల్ వెరిఫికేషన్ చేస్తున్నారు. కాగా, కోర్టు వివాదాల్లో ఉన్న భూములను కొనుగోలు చేసే ముందు లాయర్‌తో, సబ్-రిజిస్ట్రార్ ఆఫీస్‌లో పూర్తి విచారణ చేయించుకోవాలని పోలీసులు సూచించారు.