తెలంగాణ

‘ఏకశిల‘ స్కూల్ అక్రమ అడ్మిషన్లు..!చర్యలు తీసుకోలేమన్న ఎంఈఓ

‘ఏకశిల‘ స్కూల్ అక్రమ అడ్మిషన్లు..!చర్యలు తీసుకోలేమన్న ఎంఈఓ

నవదిశ: తెలంగాణ బ్యూరో: హయత్‌నగర్ మండల పరిధిలో వివాదాస్పదంగా మారిన ‘ఏకశిల’ స్కూల్ వ్యవహారం మరో సారి తెరమీదకొచ్చింది. పాఠశాల పేరు మార్పు, అనుమతులు, అడ్మిషన్ల ప్రక్రియపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్న వేళ మండల విద్యాధికారి శ్రీనివాస్ స్పందించిన తీరు విమర్శలకు దారితీస్తోంది. ‘పేరు మార్పు కోసం దరఖాస్తు చేశారు.. ఫైలు ఆర్ జె డి వద్ద పెండింగ్‌లో ఉంది.. త్వరలోనే అనుమతి వస్తుంది’ అంటూ ఆయన చెప్పడం, మరోవైపు స్కూల్ కార్యకలాపాలు ‘ఏకశిల అడ్వాన్స్డ్ లెర్నింగ్ స్కూల్’ పేరుతో సాగుతున్నాయనే తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇది అనేక అనుమానాలకు తావిస్తోంది. నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారి యాజమాన్యానికి తొత్తుగా మాట్లాడటం వెనుక మామూళ్ల మాయ ఉందని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు.

ప్రియదర్శిని కాలనీలో ‘సెయింట్ జోసెఫ్ హై స్కూల్’ పేరుతో అనుమతి పొందిన విద్యాసంస్థను 2 ఏళ్ల నుంచి ఏకశిల గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్ అని, ఏకశిలా స్కూల్ అని.. వేర్వేరు పేర్లు మార్చుతూ, బోర్డులు ప్రదర్శిస్తూ.. సీబీఎస్ఈ కరిక్యులమ్ అంటూ డబుల్ ఫీజులు చేస్తూ.. విద్యాశాఖ నిబంధనలను తుంగలో తొక్కుతోందని ఆరోపిస్తున్నారు. ఈ అకడమిక్ ఇయర్ మరో అడుగు ముందుకేసి ‘ఏకశిల అడ్వాన్స్‌డ్ లెర్నింగ్ స్కూల్’గా ప్రచారం చేసుకుంటూ.. పర్మిషన్ వచ్చిందంటూ అబద్దపు ప్రచారం చేస్తూ అమాయకులను బురిడీ కొట్టిస్తూ అడ్మిషన్లు తీసుకుంటున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. అలాగే.. బోర్డులు, యూనిఫాంలు, పుస్తకాలు, మొబైల్ యాప్‌లు, బస్సులు అన్నీ ‘ఏకశిల’ పేరుతో ఉన్నాయి. అయితే అడ్మిషన్లను ‘సెయింట్ జోసెఫ్’ పేరుతోనే తీసుకుంటున్నారు అంటూ ఎంఈవో శ్రీనివాస్ అన్నారు. ఇలా ఎంఈఓ సైతం యాజమాన్యానికి వత్తాసు పలకడంతో వివాదానికి దారితీస్తోంది. రెండు అకడమిక్ ఇయర్స్ నుంచి ఈ వ్యవహారం కొనసాగుతు న్నా, విద్యార్థి సంఘాలు, విద్యావేత్తల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా.. ఎంఈవో చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎంఈఓ లంచం తీసుకుని స్కూల్ యాజమాన్యానికి సపోర్ట్ చేస్తున్నారని, తమ పిల్లల్ని ఏకశిల పేరుతోనే చేర్పించామని, ఇప్పుడు అనుమతులు లేవని తెలిసి ఆందోళనగా ఉందంటున్నారు తల్లిదండ్రులు. వెంటనే డీఈఓ జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.