వారం రోజులు ఫుల్ రెయిన్స్
- పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
*లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్త
*తెలంగాణకు ఐఎండీ హెచ్చరిక
నవదిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ వ్యాప్తంగా రానున్న వారం రోజుల్లో వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ విభాగం రాష్ట్ర ప్రజలను హెచ్చరించింది. పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అధికారికంగా ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేశారు. వర్షాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు సంభవించవచ్చు. గంటకు బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. రాజధాని హైదరాబాద్ సహా చాలా జిల్లాలకు ప్రస్తుత పరిస్థితులను బట్టి ‘యెల్లో అలర్ట్’ కూడా ప్రకటించారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. రేపటి నుండి ప్రారంభమై జూలై 2 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. రాబోయే ఏడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు నిరంతరాయంగా కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ముఖ్యంగా రాబోయే 48 గంటల్లో హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. దీనివల్ల నగర ప్రజలు తమ ప్రయాణాల పరంగా ముందస్తు ప్రణాళికలు చేసుకోవాలని అధికారులు సూచించారు. అకస్మాత్తుగా కురిసే వర్షాల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. కార్యాలయాలకు వెళ్లేవారు, అత్యవసర పనులపై బయటకు వచ్చేవారు వాతావరణ పరిస్థితులను గమనించి బయలుదేరడం మంచిది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ప్రత్యేకంగా హెచ్చరించింది. వర్షం పడే సమయంలో ఈదురు గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఉరుములు, మెరుపుల ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉన్నందున, ప్రజలు అనవసరంగా బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. మురుగునీరు నిలిచే ప్రాంతాల్లో నివసించేవారు సురక్షిత ప్రాంతాలకు మారడం శ్రేయస్కరం. వాహనదారులు ప్రయాణాల సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండటం మంచిది. రోడ్లపై నీరు నిలిచే అవకాశం ఉన్నందున ప్రమాదాలకు తావులేకుండా నెమ్మదిగా ప్రయాణించాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. జీహెచ్ఎంసీ, విపత్తు నిర్వహణ బృందాలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్నాయి. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్ నంబర్లను సంప్రదించవచ్చు. వాతావరణ శాఖ జారీ చేసే ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని గమనిస్తూ సురక్షితంగా ఉండాలి

