సినిమా

"స్పిరిట్" టైటిల్ వివాదంపై ఫిల్మ్ చాంబర్ మౌనం ఎందుకు?

"స్పిరిట్" టైటిల్ వివాదంపై ఫిల్మ్ చాంబర్ మౌనం ఎందుకు?

నవదిశ, తెలంగాణ బ్యూరో: సినిమా టైటిళ్ల వివాదాలు తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్తవి కావు. గతంలో అనేక సందర్భాల్లో ఒకే పేరుపై వివాదాలు తలెత్తినప్పుడు ఫిల్మ్ చాంబర్ జోక్యం చేసుకుని రాజీ మార్గాలు చూపింది. అయితే ప్రస్తుతం "స్పిరిట్" సినిమా టైటిల్ వివాదంలో ఫిల్మ్ చాంబర్, పరిశ్రమ పెద్దల వైఖరిపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వివాదంలో చిక్కుకున్న చిన్న నిర్మాత కుటుంబ సభ్యులు ఫిల్మ్ చాంబర్ కార్యాలయం వద్దే మీడియా సమావేశాలు నిర్వహించి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఇప్పటివరకు సరైన స్పందన రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పరిస్థితితో పరిశ్రమలో చిన్న నిర్మాతలకు, కొత్తగా వచ్చిన వారికి న్యాయం జరుగుతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో బాలకృష్ణ నటించిన "సామ్రాట్" సినిమా టైటిల్ విషయంలో వివాదం తలెత్తడంతో "సాహస సామ్రాట్"గా పేరు మార్చి విడుదల చేశారు. అలాగే "లయన్" టైటిల్ విషయంలో హక్కుల వివాదం రావడంతో "ఎన్‌బీకే లయన్" పేరుతో విడుదల చేసిన సంఘటన ఉంది. మహేష్ బాబు నటించిన "ఖలేజా" చిత్రాన్ని కూడా "మహేష్ ఖలేజా"గా ప్రచారం చేశారు. ఇటీవలి కాలంలో "వారణాసి" టైటిల్ విషయంలోనూ భేదాభిప్రాయాలు రావడంతో ప్రత్యేక గుర్తింపులతో వ్యవహరిస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టైటిల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఉద్దేశమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లక్షల రూపాయలు ఖర్చు చేసి టైటిళ్లు నమోదు చేయించుకున్న తర్వాత కూడా వాటికి రక్షణ లేకపోతే నిర్మాతలకు నష్టం తప్పదని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. "స్పిరిట్" చిత్రానికి ఇప్పటికే ప్రత్యేక ట్యాగ్ లైన్ జోడించినప్పటికీ విడుదలకు అడ్డంకులు ఎందుకు వస్తున్నాయనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చిన్న నిర్మాతలు, కొత్తవారికి పరిశ్రమలో సమాన అవకాశాలు కల్పించాలంటే ఫిల్మ్ చాంబర్ పెద్దలు, సినీ ప్రముఖులు చొరవ తీసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని పలువురు కోరుతున్నారు. పరిశ్రమ కొందరికే పరిమితం కాదని, ప్రతిభ ఉన్న ఎవరైనా సినిమా రంగంలోకి రావచ్చనే సందేశాన్ని బలపరిచేలా "స్పిరిట్" టైటిల్ వివాదానికి న్యాయమైన పరిష్కారం చూపాలని సినీ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.