తెలంగాణ

స్టానికత పై సుప్రీంకు వెళ్లుతామన్న కవిత

స్టానికత పై సుప్రీంకు వెళ్లుతామన్న కవిత

నవదిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ స్థానికత అంశంలో నిరుద్యోగుల హక్కులను కాపాడటానికి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటం చేస్తామని తెలంగాణ రక్షణ సేన చీఫ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ స్థానికత - సవాళ్లు అనే అంశంపై తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశ ముగింపులో ఆమె మాట్లాడారు.నాలుగేళ్లు ఇక్కడ చదివితే స్థానికులుగా పరిగణించ వచ్చంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే కోర్టు దీనికి పూర్తిగా విరుద్ధమైన తీర్పునిచ్చిందని గుర్తు చేస్తూ, ఒకే అంశంపై మూడు నాలుగు ఏళ్లకు ఒకసారి తీర్పులు మారకుండా కోర్టులకు కూడా ఒకే విధానం ఉండాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ లాయర్ల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అనుభవజ్ఞులైన అడ్వకేట్లతో సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని కోరారు.ప్రభుత్వం స్పందించకుంటే నిరుద్యోగుల తో కలిసి తామే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.

స్థానికత విషయంలో పాత ముల్కీ నిబంధనల తరహాలోనే 15 ఏళ్లు ఇక్కడ నివసిస్తేనే స్థానికులుగా గుర్తించేలా నిబంధనలు తేవాలన్నారు. గన్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు ఎంత పకడ్బందీగా ఎంక్వైరీ చేస్తారో, లోకల్ సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు కూడా అధికారులంతా అంతే కఠినంగా వ్యవహరించాలని, నిర్లక్ష్యం వహిస్తే అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అని వ్యాఖ్యానించిన కవిత, తాము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ హయాంలో జరిగిన అన్ని ఉద్యోగ నియామకాలపై న్యాయ విచారణ జరిపిస్తామని ప్రకటించారు. 371డి, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో 29 వల్లే స్థానికేతరులు ఇక్కడికి వస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఉన్న జీవో 55ను రద్దు చేసి జీవో 29 తేవడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, తెలంగాణ ఫస్ట్ అనే భావన వచ్చేలా జీవో 29ని రద్దు చేసి పాత జీవో 55 ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.రోస్టర్ విధానం ద్వారా కూడా అందరికీ న్యాయం జరిగేలా చూడాలని, దీనిపై తమ పార్టీ తరఫున ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంటామని వెల్లడించారు. 2018 రాష్ట్రపతి ఉత్తర్వులను త్వరితగతిన అమలు చేస్తూ నియామకాలు చేపట్టాలని కోరారు.

ఉద్యోగ ప్రకటన చేయాలి- కవిత రాష్ట్రంలో దాదాపు 15 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారని, ప్రభుత్వం వెంటనే 20 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలతో పెద్ద సంఖ్యలో నోటిఫికేషన్లు విడుదల చేయాలని కవిత డిమాండ్ చేశారు. అభ్యర్థులకు నష్టం కలిగిస్తున్న జీవో 46ను వెంటనే సరిచేయాలని, వయోపరిమితి సడలింపును గతంలో ఉన్నట్లుగానే కొనసాగించాలని కోరారు. ఉర్దూ డీఎస్సీ, ఆదివాసీల కోసం ప్రత్యేక డీఎస్సీ వేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా మాట తప్పిందని విమర్శించారు. ఆదివాసీ, ఎస్టీల హక్కుల రక్షణ కోసం తమ జాగృతి సంస్థ ద్వారా ప్రత్యేక వింగ్స్ ఏర్పాటు చేశామని,గతంలో సింగరేణిలో ఎంతోమంది ఆదివాసీ బిడ్డలకు ఉద్యోగాలు ఇప్పించానని గుర్తు చేశారు.

కోర్టు తీర్పుపై మేధావులు స్పందించాలి కోర్టు తీర్పు వల్ల నష్టం జరుగుతున్నా కొంతమంది మేధావులు తమ పదవుల కోసం మౌనంగా ఉంటున్నారని, అయితే ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో యువ తెలంగాణ పోరాట చైతన్యం స్పష్టంగా కనిపిస్తోందని కవిత కొనియాడారు. ఈ సమావేశం ద్వారా పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్ చేయడం, 2018 ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ త్వరితగతిన అమలు, జీవో 29 రద్దు - జీవో 55 పునరుద్ధరణ, కాంగ్రెస్ ప్రభుత్వ నియామకాల పై న్యాయ విచారణ, స్థానికత కాలపరిమితిని 15 ఏళ్లకు పెంచాలనే ప్రతిపాదనలను తీర్మానాలుగా ఆమోదించినట్లు ఆమె వెల్లడించారు.