నవదిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర కేబినెట్ పునర్‌వ్యవస్థీ కరణకు సంబంధించి రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆదివారం లేదా సోమవారం కేంద్ర మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ చేపట్టే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారిక ప్రకటన వెలువడకపోయినా, పలువురు నేతలకు కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉందని సమాచారం. మాజీ ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌కు కేబినెట్ మంత్రి పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు మానవ వనరుల శాఖ బాధ్యతలు అప్పగించే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం కేబినెట్‌లో ఉన్న ధర్మేంద్ర ప్రధాన్, హర్దీప్ సింగ్ పూరి పదవులకు గుడ్‌బై చెప్పే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలను ఎన్డీఏలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండేకు కేబినెట్‌లో స్థానం కల్పించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు పూర్తిస్థాయి కేబినెట్ హోదా దక్కవచ్చని, మీరట్ ఎంపీ అరుణ్ గోవిల్‌కు కూడా అవకాశం లభించవచ్చని ప్రచారం జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలను పంకజ్ చౌదరికి అప్పగించనున్న నేపథ్యంలో ఆయన కేబినెట్ నుంచి తప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వచ్చిన నేతల్లో రాఘవ్ చద్దా లేదా అశోక్ మిట్టల్‌కు మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం. గతంలో పార్టీ మారి మంత్రి పదవులు పొందిన నేతల్లో రవనీత్ బిట్టూకు ఈసారి అవకాశం ఉండకపోవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్‌కు కూడా కేబినెట్‌లో స్థానం దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వర్గానికి కూడా కేంద్ర కేబినెట్‌లో అదనపు ప్రాతినిధ్యం కల్పించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
శివసేనకు చెందిన కేంద్ర మంత్రి ప్రతాప్‌రావు జాధవ్‌కు ఉద్వాసన పలికి, ఆయన స్థానంలో సంజయ్ దీనా పాటిల్‌కు అవకాశం కల్పించవచ్చని ప్రచారం జరుగుతోంది. అలాగే మనోహర్‌లాల్ ఖట్టర్ వద్దనున్న విద్యుత్ శాఖను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లోని ఖజురాహో ఎంపీ విష్ణు దత్త శర్మ, బీహార్ ఎంపీ జనార్ధన్ సింగ్ సిగ్రీవాల్‌లకు కూడా కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అంతేకాకుండా కనీసం ఆరుగురు సహాయ మంత్రులను కూడా తప్పించే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

