నవదిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల సంఘం చేపట్టనున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ ఐ ఆర్) కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కోఆర్డినేటర్లను నియమించింది. ఇందుకు సంబంధించిన జాబితాను పార్టీ గురువారం పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విడుదల చేశారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు ప్రత్యేక కోఆర్డినేటర్లను నియమించినట్లు వెల్లడించారు. వీరు ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియ, పార్టీ కార్యకర్తల సమన్వయం, ఓటర్ల నమోదు, తొలగింపులు, మార్పులు వంటి అంశాలపై పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు అన్ని నియోజకవర్గాలకు పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ ప్రతినిధులు, ఇతర సీనియర్ నేతలను కోఆర్డినేటర్లుగా నియమించినట్లు జాబితాలో పేర్కొన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కోఆర్డినేటర్ల మొబైల్ నంబర్లను కూడా పార్టీ అందుబాటులో ఉంచిందని తెలిపారు. రానున్న ఎన్నికల ప్రక్రియలో ఓటరు జాబితాల సవరణ కార్యక్రమం కీలకంగా మారనున్న నేపథ్యంలో ఈ నియామకాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఓటరు నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొనేలా కోఆర్డినేటర్లు చర్యలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
తెలంగాణ
కాంగ్రెస్ పార్టీ ఎస్ఐఆర్ అసెంబ్లీ కోఆర్డినేటర్ల నియామకం

