నవదిశ, తెలంగాణ బ్యూరో: తుంగభద్ర నది, రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) పరిధిలో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన నీటి వాటాను కాపాడటంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆర్డీఎస్ పరిధిలో తెలంగాణ హక్కులను కాలరాస్తూ కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వత్తాసు పాడుతున్నారని ఆమె ఆరోపించారు. హైదరాబాద్ టీఆరెఎస్ కార్యాలయంలో ఒక ప్రకటన విడుదల చేశారు. కవిత మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 12 ఏళ్లు గడుస్తున్నా.. కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి మనకు దక్కాల్సిన పూర్తిస్థాయి నీటిని వాడుకో లేకపోవడం దురదృష్టకరమన్నారు.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నడిగడ్డ ప్రజల జీవనాడి అయిన ఆర్డీఎస్ ప్రాజెక్టులో తెలంగాణకు 16 టీఎంసీల నీటి వాటా ఉంటే, గత ఉమ్మడి పాలనలో కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత కానీ కేవలం 6 టీఎంసీలకు మించి వాడుకోలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.మన హక్కులను కాపాడుకోవడానికి ఆర్డీఎస్ చుట్టుపక్కల ఉన్న రిజర్వాయర్లను బలోపేతం చేయాల్సి ఉండగా.. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం, ప్రస్తుత రేవంత్ సర్కార్ ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల నడిగడ్డ ప్రజలకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతూనే ఉందన్నారు.
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుంకేశుల నుంచి తనకు ఉన్న 16 టీఎంసీల వాటాను మౌలిక సదుపాయాలు పెంచుకోవడం ద్వారా 32 టీఎంసీలకు పెంచుకుని విచ్చలవిడిగా వాడుకుంటుంటే.. తెలంగాణ మాత్రం వెనుకబడిపోయిందని గుర్తుచేశారు.మనం ప్రాజెక్టులు నిర్మించుకునే లోపే కర్ణాటక ప్రభుత్వం తుంగభద్రపై కురిడి, కల్పగల్ గ్రామాల్లో 2 టీఎంసీలు, ఆర్డీఎస్‌కు ఎగువన చిక్కాలపర్వి వద్ద 2.50 టీఎంసీలు, దిగువన రాయచూరు జిల్లా చిక్క మంచాల సమీపంలో 5 టీఎంసీల సామర్థ్యంతో మొత్తం 10 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా మూడు ప్రాజెక్టులను అక్రమంగా నిర్మిస్తోందని కవిత వివరించారు. వాస్తవానికి కర్ణాటకకు ఆర్డీఎస్‌లో కేవలం 1.20 టీఎంసీల వాటా మాత్రమే ఉందని, కానీ వారు 10 టీఎంసీల నీటిని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి తెలంగాణ వ్యతిరేక కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లతో కలిసి కూర్చోవడం రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అని విమర్శించారు. కర్ణాటక ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తే తుంగభద్రలో తెలంగాణ తన నీటి హక్కులను శాశ్వతంగా కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో కర్ణాటకలో జరిగే ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లకూడదని ఆమె డిమాండ్ చేశారు. ఒకవేళ వెళితే గనుక.. అదే వేదికపై ఏపీ సీఎం చేత బనకచర్ల కట్టేలా, కర్ణాటక సీఎం చేత ఈ మూడు అక్రమ ప్రాజెక్టులను రద్దు చేసుకునేలా ఒప్పించాలని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రయోజనాలకు ముప్పు తెచ్చే ఈ కార్యక్రమానికి వెళ్లే బదులు, తక్షణమే కేంద్ర జలశక్తి శాఖ (సెంట్రల్ వాటర్ కమిషన్) వద్దకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలతో కూడిన అఖిలపక్షాన్ని తీసుకెళ్లి మన నీటి హక్కుల కోసం పోరాడాలని సూచించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాల ప్రయోజనాలను కాపాడటం కోసం రేవంత్ రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకోవాలని, లేనిపక్షంలో నడిగడ్డ ప్రజలకు ఈ ప్రభుత్వం అతిపెద్ద ద్రోహం చేసినట్లు అవుతుందని కవిత హెచ్చరించారు.

