నవదిశ, తాండూరు: అవినీతి అక్రమాలకు పాల్పడిన యాలాల ఆర్ఐ శివచరణ్ కుమార్ ని సస్పెండ్ చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్,కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బుగ్గప్పలు డిమాండ్ చేశారు. వారి ఆధ్వర్యంలో తాండూరు ఆర్డీవో కార్యాలయంలో ఎఓకి బుధవారం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రంలో గత రెండు సంవత్సరాల నుండి అనుమతి లేకుండా ఇసుక తరలించిన ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేసి యాలాల పోలీస్ స్టేషన్లో అన్లోడ్ చేయించడం జరిగిందని వారు ఆరోపించారు. దాదాపు 260 ట్రిప్పులకు సంబంధించిన ఇసుకను డంపు చేయడం జరిగిందన్నారు. ఇట్టి డంపు చేసిన ఇసుకను వేలంపాట వేయాలంటే ప్రభుత్వ నిబంధనల పరంగా బహిరంగంగా పత్రిక ప్రకటన చేయాల్సి ఉంటుంది కానీ ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా ఏకపక్షంగా వేలం వేసి కాంట్రాక్టర్ లతో కుమ్మక్కు అయినా ఆర్ ఐ చరణ్ కుమార్ పై చట్ట పరం అయినా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
మండల తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాహసిల్దార్, కింది స్థాయి అధికారుల ఇన్షియల్, లేకుండానే, నేనే బాస్ అన్నట్టు ఆర్ ఐ చరణ్ కుమార్ వ్యవహారిస్తున్నారు. ఆయన చేసిన నిర్వాకం మూలంగా ప్రభుత్వ ఆర్థికశాఖకు రావాల్సిన 10 లక్షల రూపాయలు సంబందించిన నిధులకు గండి పడింది అని అన్నారు.ఇప్పటికే అనేక భూ సమస్యలల్లో, అక్రమ ఎర్రమట్టి విషయాలల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్. ఐ చరణ్ కుమార్ పై చట్టపరంగా చర్యలు తీసుకోక పోతే తాండూర్ ఆర్డీవో కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు చంద్రయ్య, TSMHPS తాండూర్ ఇన్చార్జి మమ్మద్ సాదిక్, కుర్వ సంఘం నాయకులు, బాలప్ప, డాక్టర్ ముగ్ధం, తిరుపతి, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.

