నవదిశ, రంగారెడ్డి బ్యూరో: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో రెండు లైవ్ బుల్లెట్లు పట్టుబడ్డాయి.
విశాఖపట్నం మధురవాడకు చెందిన మధుబాబు వద్ద ఈ బుల్లెట్లను గుర్తించినట్లు సమాచారం. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చిన మధుబాబు, తిరిగి ఇండిగో విమానంలో ప్రయాణించేందుకు విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో ఆయన వద్ద రెండు లైవ్ బుల్లెట్లు లభించాయి. వాటికి సంబంధించిన ఎలాంటి అనుమతి పత్రాలు, డాక్యుమెంట్లు లేకపోవడంతో అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో ఆర్‌జీఐఏ పోలీసులు మధుబాబును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. బుల్లెట్లు ఆయన వద్దకు ఎలా వచ్చాయి, వాటి ఉద్దేశం ఏమిటనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

