జిల్లా వార్తలు

వారికి మెరుగైన సేవలు అందించడమే భరోసా కేంద్రాల ప్రధాన లక్ష్యం :ఎస్పీ శరత్ చంద్ర పవార్

వారికి మెరుగైన సేవలు అందించడమే భరోసా కేంద్రాల ప్రధాన లక్ష్యం  :ఎస్పీ శరత్ చంద్ర పవార్

నవదిశ, నల్గొండ టౌన్ : తెలంగాణ రాష్ట్ర మహిళా భద్రత విభాగం ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలోని భరోసా కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి విశ్వనాథ్ కులకర్ణి, ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి సాయి మేఘనా, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ కృష్ణయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...లైంగిక దాడులు, వేధింపుల వంటి ఘటనలకు గురైన మహిళలు, చిన్నారులకు ఒకే చోట వైద్య,న్యాయ,మానసిక,పునరావాస సేవలు అందించడమే భరోసా కేంద్రాల ప్రధాన లక్ష్యమని తెలిపారు. బాధితులకు అవసరమైన వైద్య పరీక్షలు, కౌన్సెలింగ్, న్యాయ సహాయం, స్టేట్‌మెంట్ నమోదు, పునరావాసం, పరిహారం వంటి సేవలను ఎలాంటి ఆలస్యం లేకుండా సమగ్రంగా అందించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో 2021 నుంచి 2026 వరకు భరోసా కేంద్రం పరిధిలో పోక్సో, అత్యాచారం, మహిళలు,చిన్నారులపై మొత్తం 806 కేసులు నమోదైనట్లు తెలిపారు. వీటిలో 16 కేసుల్లో నిందితులకు శిక్షలు ఖరారయ్యాయని వెల్లడించారు. అలాగే బాధితులకు మొత్తం రూ.1.68 కోట్లకు పైగా పరిహారం అందించినట్లు పేర్కొన్నారు. పోక్సో కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా పోలీసులు, ప్రాసిక్యూషన్ అధికారులు, వైద్య శాఖ, ఫోరెన్సిక్ నిపుణులు, భరోసా కేంద్రం సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు. కేసుల దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ, న్యాయపరమైన చర్యల్లో అన్ని శాఖల సమిష్టి కృషి వల్లే నిందితులకు శిక్షలు పడుతున్నాయని అన్నారు. కేసుల విచారణలో సాంకేతిక ఆధారాలు, వైద్య నివేదికలు, బాధితుల వాంగ్మూలాలు అత్యంత కీలకమని, వాటిని నాణ్యతతో, నిర్దిష్ట గడువులో కోర్టుకు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దర్యాప్తు ప్రక్రియలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యతతో తీసుకోవాలని సూచించారు. లైంగిక వేధింపులు, బాధితుల న్యాయ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని శాఖలు మానవత్వంతో స్పందించాలని, బాధితుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ రంజిత్ కుమార్, ఉమెన్ పోలీస్ స్టేషన్ సీఐ మంజుల, భరోసా ఇన్‌చార్జ్ ఎస్సై అమ్రిన్, భరోసా కేంద్రం కోఆర్డినేటర్ నళిన, వైద్య శాఖ,మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారులు, న్యాయ విభాగ ప్రతినిధులు, భరోసా కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.