జిల్లా వార్తలు

అధికారుల కోసం నిరీక్షణ.. 11:30 అయినా సార్లకు సమయం కాలేదు..!

అధికారుల కోసం నిరీక్షణ..
11:30 అయినా సార్లకు సమయం కాలేదు..!

నవదిశ, తాండూరు: దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించని విధంగా తయారైంది వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిస్థితి. ప్రజలకు అందాల్సిన సేవలు అధికారులు పర్యవేక్షణ లోపం కారణంగా అదనపు భారం మోపుతూ సిబ్బంది అందిన కాడికి దోచుకుంటున్నారు. అధికారులు సమయపాలన పాటించకున్న అడిగేవారు ఎవరు లేకపోవడంతో కింద స్థాయి సిబ్బంది ఇష్టారీతిన వ్యవహారిస్తున్నారు. మా ఇష్టం వచ్చిన సమయానికి వస్తాం - వెళ్తాం మమ్మల్ని అడిగేవారు ఎవరు లేరు అన్న తీరుగా వ్యవహరిస్తున్నారు.

ఉదయం 10 గంటలకు విధులకు రావాల్సి ఉండగా, సమయం 11:30 అవుతున్న తాండూరు సబ్ రిజిస్టర్ కార్యాలయానికి సమయానికి అధికారులు, సిబ్బంది విధులకు గురువారం హాజరు కాలేదు. అవసరాల నిమిత్తం, రిజిస్ట్రేషన్లు, బాండ్ పేపర్ కోసం గురువారం ఉదయం 10 గంటలకు సబ్ రిజిస్టర్ కార్యాలయానికి ప్రజలు వెళ్లి అధికారుల, సిబ్బంది కొరకు పడికాపులతో వేచి చూడాల్సి వస్తుందని మండిపడ్డారు. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సమయపాలన తోపాటు తమ విధులకు సమయానుకూలంగా హాజరువుతుండగా ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం సమయపాలన పాటించకుండా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు.

ప్రభుత్వ కార్యాలయమే కదా తమ ఇష్టం వచ్చిన సమయానికి రావచ్చన్న ధీమాతో ఉద్యోగులు ఉండటం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల కోసం ప్రజలు కార్యాలయం వద్ద నిరీక్షించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాపోయారు. ప్రతి రోజు ఇదే పరిస్థితి కొనసాగుతుందని తెలిపారు. పనుల కోసం ప్రజలు రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి సబ్ రిజిస్ట్రేషన్ అధికారులు,సిబ్బందిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నారని ఆరోపించారు. జిల్లా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్న అధికారులు, సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.