నవదిశ, మునీరాబాద్ : కర్ణాటకలోని మునీరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తుంగభద్ర జలాల సమస్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు తరాలుగా కొనసాగుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా ఈ సమావేశం చరిత్రలో నిలిచిపోతుందని ఆయన అన్నారు. “ఇది కేవలం 33 గేట్ల పునరుద్ధరణ కార్యక్రమం కాదు. లక్షలాది మంది రైతుల సమస్యలను పరిష్కరించే మహత్తర కార్యక్రమం. పంచాయితీ కావాలా, సమస్య పరిష్కారం కావాలా అంటే నేను పరిష్కారమే కోరుకుంటా” అని సీఎం స్పష్టం చేశారు.
కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పటిల్ మూడు రాష్ట్రాల సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతారనే నమ్మకం వ్యక్తం చేశారు. తుంగభద్రలో మట్టి పేరుకుపోవడం, నీటి కేటాయింపుల సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. గద్వాల, అలంపూర్, పాలమూరు ప్రాంతాలకు చెందిన ఆర్‌డీఎస్ కు కేటాయించిన 17.9 టీఎంసీల నీటిలో ప్రస్తుతం కేవలం 5 నుంచి 6 టీఎంసీలే రైతులకు అందుతున్నాయని, దాదాపు 10 టీఎంసీల నీరు వినియోగంలోకి రావడం లేదని పేర్కొన్నారు.
ఈ సమస్యలపై జరిగిన చర్చల్లో శాశ్వత పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకున్నామని, తుంగభద్ర నది ఒడ్డున రాజకీయాలకు అతీతంగా జరిగిన ఈ సమావేశం అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి కొత్త మార్గం చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. “మైసూరు రాజులు సైతం రైతుల ప్రయోజనాల కోసం యుద్ధాలను పక్కనబెట్టి పరిష్కార మార్గాన్ని ఎంచుకున్నారు. రైతుల కోసం రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. త్వరలోనే కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో సమస్యకు స్పష్టమైన పరిష్కారం లభిస్తుందని, మునీరాబాద్‌లో జరిగిన ఈ సమావేశం ఆ దిశగా తొలి అడుగుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

