తెలంగాణ

బస్టాండ్‌లో షాపులు పెట్టుకునేవారికి గుడ్ న్యూస్..

బస్టాండ్‌లో షాపులు పెట్టుకునేవారికి గుడ్ న్యూస్..

వనదిశ, తెలంగాణ: ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయాణ అనుభూతులతో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ఇప్పుడు సరికొత్త వ్యాపార రంగంలోనూ వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుడుతోంది. కేవలం ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చడమే కాకుండా సంస్థ పరిధిలోని వనరులను సద్వినియోగం చేసుకుంటూ అదనపు ఆదాయాన్ని పెంచుకునే దిశగా అడుగు వేస్తోంది.ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కమర్షియల్ కాంప్లెక్స్‌లలో ఖాళీగా ఉన్న షాపులను అద్దె ప్రాతిపదికన కేటాయించేందుకు సంస్థ సిద్ధమైంది. కొత్తగా వ్యాపారాలు పెట్టుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం.

ఆర్టీసీ బస్టాండ్లు సహజంగానే అధిక జనసంచారం ఉండే ప్రాంతాలు. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు ఈ ప్రాంతాల గుండా రాకపోకలు సాగిస్తుండటంతో, అక్కడ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే వారికి విస్తృత స్థాయిలో వినియోగదారులు లభించే అవకాశం ఉంటుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, సూపర్ మార్కెట్లు, బ్రాండెడ్ షోరూమ్‌లు, మెడికల్ స్టోర్లు, చిన్న వ్యాపార సంస్థలు వంటి అనేక రకాల వ్యాపారాలకు ఈ ప్రదేశాలు అనుకూలంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. సంస్థ ఆర్టీసీ లాభాల బాట పట్టించుకోవడంతోపాటు స్థానికి నిరుద్యోగులకు, వ్యాపారులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 694 కమర్షియల్ షాపులను టీజీఎస్ఆర్టీసీ అద్దెకు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. బస్టాండ్లు, డిపోల పరిధిలో ఉన్న ఈ వ్యాపార సముదాయాలకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. టీజీఎస్ ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయానికి అదనపు ఆదాయన్ని చేకూరుస్తుందని ఇటు వ్యాపార రంగానికి సరికొత్త ఊపు అందుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.