నవదిశ, తెలంగాణ బ్యూరో: వైరల్ ఎన్‌సెఫలైటిస్ (మెదడు వాపు) వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సకాలంలో బుధవారం ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు. తాండూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన ఆడె సత్తమ్మ తీవ్ర అనారోగ్యంతో నిమ్స్‌లో చికిత్స పొందుతుండగా, ఆమె కుటుంబ సభ్యులు తమ సమస్యను ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు. పరిస్థితిని తెలుసుకున్న ఎంపీ వంశీకృష్ణ వెంటనే స్పందించి, తెలంగాణ ప్రభుత్వానికి కేసును సిఫారసు చేయడంతో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా ఆర్థిక సాయం అందేలా చర్యలు చేపట్టారు. ఎంపీ ప్రత్యేక చొరవతో సత్తమ్మ వైద్య చికిత్స కోసం రూ.2.50 లక్షల విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌ఓసీ) మంజూరైంది. దీంతో చికిత్స వ్యయభారం నుంచి కుటుంబానికి ఊరట లభించింది. ఈ సందర్భంగా ఆడె సత్తమ్మ కుటుంబ సభ్యులు ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. క్లిష్ట సమయంలో వెంటనే స్పందించి ఆర్థిక సహాయం అందించడం వల్ల చికిత్స కొనసాగించేందుకు ఎంతో దోహదపడిందని వారు పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు ఎంపీ వంశీకృష్ణ పేర్కొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు..
తెలంగాణ
అవసరానికి ఆదుకున్న సీఎం రిలీఫ్ ఫండ్

