నవదిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని పాఠశాల విద్యలో విద్యాశాఖ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా 3 నుంచి 5వ తరగతి విద్యార్థులకు వారానికి 80 నిమిషాల పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్ ద్వారా పాఠాలు చెప్పాలని నిర్ణయించింది. గణితం, తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో పిల్లల సామర్థ్యాలను పెంచేందుకు ఈ ఏఐ టూల్స్‌ను ఉపయోగించనున్నారు. అలాగే, ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలలకే పరిమితమైన ‘ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ’ విధానాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రైవేటు స్కూళ్లలోనూ తప్పనిసరి చేస్తూ విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులందరికీ ఇది వర్తిస్తుంది.
జాతీయ స్థాయి సర్వేల్లో తెలంగాణ ర్యాంకు 36 నుంచి 26కు మెరుగుపడిందని, విద్యా ప్రమాణాలను మరింత పెంచడమే లక్ష్యంగా ప్రణాళికలు వేశామని అధికారులు తెలిపారు. చదవడం, రాయడం వంటి ప్రాథమిక నైపుణ్యాల మెరుగుదలకు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు లెర్నింగ్ ఎన్‌రిచ్‌మెంట్ పీరియడ్ నిర్వహించి దాని ద్వారా వెనుకబడిన పిల్లలకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఏడాదిలో మూడు సార్లు పరీక్షలు నిర్వహించి ఆ వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ లో నమోదు చేయనున్నారు.

