తెలంగాణ

14 లక్షల మంది పేద విద్యార్థుల భవిష్యత్తు మీ చేతుల్లో.. శ్రీనివాస్ గౌడ్

14 లక్షల మంది పేద విద్యార్థుల భవిష్యత్తు మీ చేతుల్లో.. శ్రీనివాస్ గౌడ్

నవదిశ, తెలంగాణ బ్యూరో: 4 సంవత్సరాలుగా రాష్ట్రంలో నిలిచిపోయిన సుమారు రూ. 8 వేల కోట్ల ఫీజుల రీఇంబర్స్‌మెంట్‌ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబాపూలే ప్రజా భవన్‌లో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలు, బీసీ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డిప్యూటీ సీఎంకు అందజేశారు.

ప్రైవేట్ యాజమాన్యాల వేధింపులతో విద్యార్థుల ఆత్మహత్యలు! ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఫీజుల బకాయిలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల రాష్ట్రంలోని 14 లక్షల మంది పేద విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీ యాజమాన్యాలు ఫీజుల కోసం ఒత్తిడి చేస్తుండటంతో కొందరు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారని గుర్తుచేశారు. కాంట్రాక్టర్లకు ఇచ్చే బిల్లులను కాస్త పక్కన పెట్టి అయినా, అత్యవసరంగా పేద విద్యార్థుల ఫీజుల బకాయిలను చెల్లించి వారి భవిష్యత్తును కాపాడాలని కోరారు.

ప్రధాన డిమాండ్లు ఇవే: పాత పద్ధతిలోనే రీఇంబర్స్‌మెంట్‌: జీవో నెంబర్ 8, 9 లను రద్దు చేసి, 2008లో ప్రారంభమైన పాత విధానంలోనే ఫీజుల రీఇంబర్స్‌మెంట్‌ను అమలు చేయాలి. 10 వేల ర్యాంకు నిబంధన తొలగింపు: కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 10 వేల లోపు ర్యాంకు వస్తేనే పూర్తి ఫీజు అనే నిబంధనను ఎత్తివేసి, విద్యార్థుల పూర్తి ఫీజును ప్రభుత్వమే భరించాలి. కౌన్సిలింగ్ సమయంలో వసూళ్లు ఆపాలి: రాబోయే కౌన్సిలింగ్ సమయంలో ప్రైవేట్ కాలేజీలు విద్యార్థుల నుండి ముందస్తుగా ఫీజులు వసూలు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.

త్వరలోనే మంత్రులు, అధికారులతో కీలక సమావేశం: డిప్యూటీ సీఎం హామీ జాజుల శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తిపై ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారు. ఫీజుల రీఇంబర్స్‌మెంట్‌ పథకాన్ని పక్కాగా అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ఫీజుల బకాయిల సమస్యపై రెండు, మూడు రోజుల్లోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రులు మరియు ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి, విద్యార్థులకు అనుకూలంగా తగిన నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జాజుల శ్రీనివాస్ గౌడ్‌తో పాటు బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ పాల్గొన్నారు.