నవదిశ, తెలంగాణ బ్యూరో : రైతులకు నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాలను అందుబాటులోకి తీసుకువచ్చి అధిక దిగుబడులు సాధించేలా చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న విత్తన మేళాలను మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ నుండి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతులు నాణ్యమైన విత్తనాలను ఉపయోగించడం ద్వారా పంట ఉత్పాదకతను గణనీయంగా పెంచుకోవచ్చని అన్నారు. రైతులకు సరైన సమయంలో నాణ్యమైన విత్తనాలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
అంతర్జాతీయ, జాతీయ మార్కెట్లలో అధిక డిమాండ్ ఉన్న ఏడు సన్న వరి రకాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులతో సమగ్రంగా చర్చించిన అనంతరం ప్రభుత్వం ప్రోత్సహించాలని నిర్ణయించిందన్నారు. రైతులు ఈ రకాల సాగుకు ముందుకు రావాలని, ఈ ఏడు రకాలకే ప్రభుత్వం ప్రత్యేక బోనస్ అందించనున్నట్లు తెలిపారు. దీంతో రైతులకు అధిక ఆదాయం లభించడంతో పాటు తెలంగాణ బియ్యానికి ప్రపంచ మార్కెట్లలో మరింత గుర్తింపు లభిస్తుందని అన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరి విత్తనాలతో పాటు పప్పు జాతులు, నూనెగింజలు, కూరగాయల వంటి ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను కూడా రైతులకు అందుబాటులో ఉంచినట్లు మంత్రి తెలిపారు.
పంటల వైవిధ్యీకరణ ద్వారా రైతులు నష్టాలను తగ్గించుకొని స్థిరమైన ఆదాయాన్ని పొందే అవకాశముందని పేర్కొన్నారు. జూన్ 23 నుంచి 30 వరకు రాష్ట్రంలోని 2,601 రైతు వేదికల్లో విత్తన మేళాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేళాల్లో రైతులకు 1,24,649 క్వింటాళ్ల వరి విత్తనాలు, 6,913 క్వింటాళ్ల పప్పు జాతి విత్తనాలు, 11,815 క్వింటాళ్ల నూనెగింజల విత్తనాలు, 1,339 క్వింటాళ్ల కూరగాయల విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. అదనంగా నానో యూరియా, నానో డి.ఏ.పీ. ఎరువులను కూడా రైతుల కొనుగోలుకు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. విత్తనాల విక్రయంతో పాటు వాటి సాగు విధానాలు, పంట యాజమాన్యం, సమగ్ర పంట సంరక్షణ, అధిక దిగుబడుల సాధనకు సంబంధించిన అంశాలపై వ్యవసాయ శాఖ అధికారులు, అనుబంధ శాఖల సిబ్బంది, వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రైతులకు ప్రత్యేక అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ధ్రువీకరించిన విత్తనాలను కొనుగోలు చేసి శాస్త్రీయ సాగు పద్ధతులను అనుసరించి అధిక దిగుబడులు సాధించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ సంచాలకులు గోపి, జగిత్యాల శాసనసభ్యులు సంజయ్, వరంగల్ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి, పాలకుర్తి శాసనసభ్యులు యశస్విని రెడ్డి, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, వివిధ జిల్లాల కలెక్టర్లు రైతులు శాస్త్రవేత్తలు అధికారులు పాల్గొన్నారు.

