నవదిశ, తెలంగాణ బ్యూరో: అల్వాల్ లో ఫైర్ స్టేషన్ ఏర్పాటు ప్రక్రియ ను వేగవంతం చేయాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బుధవారం నానక్‌రామ్‌గూడలోని డైరెక్టర్ జనరల్ ఫైర్ అండ్ డిజాస్టర్ సర్వీసెస్ కార్యాలయంలో డైరెక్టర్ జనరల్ ఫైర్ సేఫ్టీ విక్రమ్ సింగ్ మాన్ కు వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా అల్వాల్ ప్రాంతంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు కోసం ఇప్పటికే ప్రతిపాదించిన అంశాలను త్వరితగతిన పూర్తి చేసి, ఫైర్ స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అల్వాల్, పరిసర ప్రాంతాల్లో జనాభా వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో అగ్నిప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల సమయంలో సత్వర సేవలు అందించేందుకు ఫైర్ స్టేషన్ ఏర్పాటు అత్యంత అవసరమని ఎమ్మెల్యే వివరించారు. స్థానిక ప్రజల భద్రత దృష్ట్యా ఈ ప్రతిపాదనకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే వినతిపై డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ సానుకూలంగా స్పందించి, సంబంధిత ప్రతిపాదనలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఏమ్మని పటేల్, వంశీ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఫైర్ స్టేషన్ ప్రక్రియను వేగవంతం చేయండి - రాజశేఖర్ రెడ్డి వినతి

