తెలంగాణ

ఎన్నికల అధికారికి బీఆర్ఎస్ నేతలు వినతి

ఎన్నికల అధికారికి బీఆర్ఎస్ నేతలు వినతి

నవదిశ తెలంగాణ బ్యూరో :ఒక పౌరుడికి ఒకే ఓటు అనేది ప్రజాస్వామ్యానికి ప్రాథమిక సూత్రం, దీనిని ఉల్లంఘిస్తూ సాగుతున్న డూప్లికేట్,బోగస్ ఓట్ల అక్రమాలను ఎంతమాత్రం సహించేది లేదని బీ ఆర్ ఎస్ నేత ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బోగస్ ఓటర్ల నెట్‌వర్క్‌ను పూర్తిగా బద్దలు కొడతామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జూన్ 25, 2026 నుండి ప్రారంభం కానున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం నేపథ్యంలో బీఆర్‌ఎస్ ముఖ్య నేతల బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ శ్రవణ్ దాసోజు మీడియాతో మాట్లాడుతూ అత్యంత కీలకమైన అంశాలను ప్రస్థావించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ఆర్ పి ఏ యాక్ట్ లోని సెక్షన్ 31 ప్రకారం ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఓట్లను కలిగి ఉండటం చట్టరీత్యా నేరమని, ఈ తప్పు రుజువైతే సంవత్సరం కాలం పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఆయన ఓటర్లను హెచ్చరించారు.తెలిసి గానీ, తెలియక గానీ రెండు చోట్ల ఓట్లు ఉంటే వెంటనే సరిదిద్దుకోవాలని సూచించారు. హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీ కావడంతో పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుండి లక్షలాది మంది ఇక్కడ నివసిస్తున్నారని, ఇక్కడ ఓటు ఉంటూ తమ స్వస్థలాల్లో కూడా ఓటును కొనసాగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతమన్నారు.

ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా ఇతర రాష్ట్రాల ఎన్నికల అధికారులతో సమన్వయం చేసుకుని ఇలాంటి డబుల్ ఓటింగ్ విధానాన్ని పూర్తిగా అణచివేయాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. గతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన 30,000 దొంగ ఓట్ల జాబితా ఆధారంగా అధికారులు 6,000 బోగస్ ఓట్లను తొలగించారని గుర్తు చేశారు.ఇదే తరహాలో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర క్షేత్రస్థాయి పరిశీలన జరగాలని ఎన్నికల అధికారిని కోరారు.ఓటరు జాబితా పారదర్శకత కోసం బీఆర్‌ఎస్ పార్టీ తరఫున 15 డిమాండ్లతో కూడిన వినతిని ఎన్నికల సంఘానికి సమర్పించినట్లు ఆయన తెలిపారు. ఎస్ఐఆర్ మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయాలని, ముందస్తు నోటీసు, చట్టబద్ధమైన విచారణ లేకుండా ఏ ఒక్క నిజమైన ఓటరు పేరును తొలగించకూడదని డిమాండ్ చేశారు. మార్పులు, చేర్పులు, తొలగింపుల సమాచారాన్ని రాజకీయ పార్టీలకు సకాలంలో అందించాలని, నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.ద్వంద్వ,అనుమానాస్పద నమోదులను గుర్తించేందుకు అత్యాధునిక డిజిటల్ టూల్స్ వాడాలని కోరారు.

ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియలో భాగస్వాములు కావడానికి ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు నేతృత్వంలో తెలంగాణవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బూత్ లెవెల్ అధికారులు, పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు కలిసి పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరిన శ్రవణ్ దాసోజు..త్వరలోనే ఈ అంశంపై మరింత సమగ్రమైన రిప్రజెంటేషన్ ఇచ్చేందుకు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అపాయింట్‌మెంట్ కోరినట్లు వెల్లడించారు.ఈ బృందంలో మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్ణే ప్రభాకర్, పార్టీ జనరల్ సెక్రెటరీ సోమా భరత్, బీసీ కమిషన్ మాజీ సభ్యులు కిషోర్ గౌడ్, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.