తెలంగాణ

ప్రతీ స్కీమ్ వెనుక స్కాం అంటున్న కేటీఆర్

ప్రతీ స్కీమ్ వెనుక స్కాం అంటున్న కేటీఆర్

నవదిశ తెలంగాణ బ్యూరో :శేరిలింగంపల్లి నియోజక వర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ కార్యకర్తలే పార్టీకి అసలైన కథానాయకులని, పదవుల కోసం గోడలు దూకే రకం కాదని ఆయన కొనియాడారు. కేసీఆర్ నాయకత్వంలో గడిచిన పదేళ్లలో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని రూ. 9,500 కోట్లతో అద్భుతంగా అభివృద్ధి చేశామని, హైదరాబాద్ వస్తే న్యూయార్క్ నగరంలో ఉన్నట్లు ఉందని సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం ప్రశంసించారని గుర్తుచేశారు.

నగరంలో కరెంట్, తాగునీటి సమస్యలను తీర్చడంతో పాటు శాంతిభద్రతలకు పెద్దపీట వేస్తూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా 10 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. పార్టీ వీడిన ఎమ్మెల్యేల గురించి ప్రస్తావిస్తూ.. బీఆర్ఎస్ కారుకు కార్యకర్తలే డ్రైవర్లని, ఈ స్టీరింగ్‌ను నడిపించేది కేసీఆరేనని స్పష్టం చేశారు. అధికార పార్టీలోకి వెళ్లిన వారు నియోజకవర్గానికి తెచ్చిన నిధులెన్నో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన కేవలం అబద్ధాలు, కూల్చివేతలతో 'అట్టర్ ప్లాప్' సినిమాను తలపిస్తోందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి హిట్లర్, తుగ్లక్, రావణాసురుడు, నరకాసురుడే ఆదర్శమని, పేదల ఇళ్లు కూల్చి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ హయాంలో జీవో నంబర్ 58 ద్వారా పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే.. ఈ ప్రభుత్వం శేరిలింగంపల్లిలో వేల ఇళ్లను కూల్చివేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫల మైందని..అత్తకు రూ. 4 వేలు, కోడలికి రూ. 2,500 ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. రాష్ట్రంలోని 1.67 కోట్ల మంది మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇస్తే తాను రాజకీయ సన్యాసానికి సిద్ధమని సవాల్ విసిరారు. 100 రోజుల్లో మార్పు తెస్తామన్న వారు.. 30 నెలలైనా ఎలాంటి పురోగతి చూపించలేరని విమర్శించారు. నగర రవాణా రంగాన్ని కూడా కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తోందని, కేసీఆర్ ప్రతిపాదించిన ఎయిర్‌పోర్ట్ మెట్రోను రద్దు చేయడంపై ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్డీకాపూల్ నుండి పటాన్‌చెరు వరకు మెట్రో అడిగితే కేంద్రంలోని బీజేపీ ఇవ్వలేదని, ఇప్పుడు రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి కలిసి నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.

కేసీఆర్ పాలనలో మెట్రోను 250 కిలోమీటర్ల మేర విస్తరించాలని ప్రణాళికలు వేశామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మాఫియా నడుస్తోందని, రియల్ ఎస్టేట్ రంగాన్ని పూర్తిగా పడగేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లు పెరిగాయని, మున్సిపల్ శాఖలో కొందరు ఐఏఎస్ అధికారులు బ్రోకర్ గిరి చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ తెచ్చే ప్రతి పథకం వెనుక పెద్ద స్కామ్ దాగి ఉందని, రూ. 280 కోట్ల విలువైన భూములపై కన్నేశారని దుయ్యబట్టారు. రైతులు, యువత, సిటీ జనం అంతా కాంగ్రెస్ మోసాలను గమనిస్తున్నారని, రాష్ట్రంలో సాగుతున్న ఈ మాఫియాను తరిమి తరిమి కొట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.