తెలంగాణ

తుంగభద్ర నుండి రావాల్సిన జల వాటా ఎక్కడ? సీఎం

తుంగభద్ర నుండి రావాల్సిన జల వాటా ఎక్కడ? సీఎం

నవదిశ, తెలంగాణ బ్యూరో: తుంగభద్ర నుంచి తెలంగాణకు రావాల్సిన నికర జలాల వాటా వినియోగం కోసం, భాగస్వామ్య రాష్ట్రాల మధ్య సమన్వయం సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. తుంగభద్ర ప్రాజెక్టు, ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్), అంతర్రాష్ట్ర జల వివాదాలపై బుధవారం జలసౌధలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ మేరకు అధికారులకు దిశానిర్దేశం చేశారు.

తుంగభద్ర డ్యామ్, నది ప్రవాహం నుంచి తెలంగాణకు హక్కుగా 15.9 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా ప్రస్తుతం ఐదు నుంచి ఆరు టీఎంసీలకు మించి నీరు అందడం లేదని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్డీఎస్ పరిధిలో జోగులాంబ గద్వాల జిల్లాలోని 75 గ్రామాల్లో 83,987 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందాల్సి ఉందని పేర్కొన్నారు. తుంగభద్ర బోర్డును పటిష్టం చేయాలి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు భాగస్వామ్య రాష్ట్రాలు కావడంతో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో తుంగభద్ర బోర్డును మరింత బలోపేతం చేసి జలాల సమర్థ వినియోగానికి చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు.

ఆర్డీఎస్ ఆనకట్ట భద్రతపై ఆందోళన ఆర్డీఎస్ ఆనకట్ట ప్రమాదకర స్థితిలో ఉందని, భద్రత దృష్ట్యా చేపట్టాల్సిన పనులను అత్యవసరంగా గుర్తించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాజోలిబండ డైవర్షన్ కెనాల్ ఆధునికీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.59 కోట్లు డిపాజిట్ చేసినప్పటికీ పనులు పూర్తి కాలేదని గుర్తు చేశారు. ప్యాకేజీ-1, ప్యాకేజీ-2 పనులు ఇంకా ప్రారంభం కాలేదని, ప్యాకేజీ-3, 4 పనులు మాత్రమే పూర్తయ్యాయని అధికారులు వివరించారు. నిలిచిపోయిన పనులను వెంటనే చేపట్టాలని, కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో జరగనున్న మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాలని నిర్ణయించారు.

పూడిక తొలగింపుపై కేంద్రాన్ని కోరాలి ఆర్డీఎస్ వద్ద తెలంగాణ వైపు పూడిక పేరుకుపోవడంతో ఆశించిన మేరకు నీటి మళ్లింపు జరగడం లేదని ఇంజినీర్లు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. 2004లో నిపుణుల కమిటీ పూడిక తొలగించాలని సూచించినప్పటికీ ఇప్పటివరకు అమలు కాలేదని సమీక్షలో చర్చించారు. పూడిక తొలగింపుతో పాటు నిపుణుల కమిటీ చేసిన సూచనలన్నింటినీ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందించాలని సీఎం సూచించారు. పూడిక పేరుకున్న ప్రాంతం కర్ణాటకలో ఉండటంతో ఆ రాష్ట్ర సహకారాన్ని కూడా కోరాలని నిర్ణయించారు.

తుమ్మిళ్ల ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి తుంగభద్ర ఎత్తిపోతల పథకం ద్వారా సాధ్యమైనంత ఎక్కువ నీటిని వినియోగించుకునే ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తుమ్మిళ్ల నుంచి నీటి వినియోగానికి కీలకమైన మల్లమ్మకుంట బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచి, పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సీఎంఓ కార్యదర్శి మాణిక్‌రాజ్, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి శ్రీధర్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.