తెలంగాణ

మొహర్రం ఊరేగింపులకు నిరంతర విద్యుత్ సీఎండీ తనిఖీ

మొహర్రం ఊరేగింపులకు నిరంతర విద్యుత్ సీఎండీ తనిఖీ

నవదిశ, తెలంగాణ బ్యూరో: మొహర్రం ఊరేగింపుల సందర్భంగా ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు చేపట్టిన ఏర్పాట్లను టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్ గురువారం ఈరోజు హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. గుల్జార్ హౌస్ నుంచి చార్మినార్ వరకు కాలినడకన పర్యటిస్తూ ఊరేగింపు మార్గాల్లోని విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్లు, జంక్షన్ బాక్సులు, ఇతర విద్యుత్ మౌలిక సదుపాయాలను పరిశీలించారు. భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక మరమ్మతు బృందాలు, వాహనాలు, అవసరమైన సామగ్రిని సిద్ధంగా ఉంచాలని సూచించారు. మొహర్రం ఊరేగింపు, ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విద్యుత్ స్తంభాలు, తీగలు, జంక్షన్ బాక్సుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అవసరమైన చోట్ల బ్యాకప్ సదుపాయాలను సిద్ధంగా ఉంచాలన్నారు.

అలాగే పోలీసు, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ మరియు ఇతర శాఖలతో సమన్వయంగా పనిచేస్తూ మొహర్రం కార్యక్రమాలు సజావుగా జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ స్తంభాలు, తీగలు, ట్రాన్స్‌ఫార్మర్ల సమీపంలో గుంపులుగా నిలవకూడదని ప్రజలకు సూచించారు. ఊరేగింపుల సమయంలో పొడవైన జెండాలు, ఇనుప వస్తువులు లేదా ఇతర సామగ్రి విద్యుత్ తీగలకు తగలకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఎక్కడైనా తెగిపోయిన విద్యుత్ తీగలు కనిపిస్తే వాటికి దూరంగా ఉండి వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. మొహర్రం సందర్భంగా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు విద్యుత్ శాఖ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా పనిచేస్తోందని సీఎండీ స్పష్టం చేశారు. ఈ తనిఖీలో డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎన్. నరసింహులు, చీఫ్ ఇంజనీర్ (మెట్రో జోన్)బిక్షపతి, సూపరింటెండింగ్ ఇంజనీర్ (సౌత్) శ్రీనివాస్, ఏడీఈలు, ఏఈలు, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.