తెలంగాణ

పట్టణాభివృద్ధికి కృషి చేయాలి - ఐఏఎస్ టీకే శ్రీదేవి

పట్టణాభివృద్ధికి కృషి చేయాలి - ఐఏఎస్ టీకే శ్రీదేవి

నవదిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వ అధికారుల కోసం నిర్వహించిన ఒక రోజు ప్రత్యేక అవగాహన కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లోని 'మెర్క్యూర్ హోటల్'లో విజయవంతంగా ముగిసింది. ప్రజాప్రతినిధుల నాయకత్వ సామర్థ్యాలను పెంపొందించడం, పట్టణ పాలనలో సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకునేలా వారికి మార్గదర్శనం చేయడమే లక్ష్యంగా ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, ఎన్ఐయూఎం డైరెక్టర్ జనరల్ టి.కే. శ్రీదేవి ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో పట్టణాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల ద్వారా అపరిమితమైన అవకాశాలు ఉన్నాయని, వాటిని ప్రజాప్రతినిధులు అందిపుచ్చుకోవాలని సూచించారు. ఇందుకోసం మేయర్లు, చైర్‌పర్సన్లలో ఒక స్పష్టమైన విజన్ ఉండాలన్నారు.

ఈ సందర్భంగా పురపాలక సంఘాల్లో పనులను ప్రాధాన్యతా క్రమంలో విభజించుకోవాలని, ఏ పని చేసినా అందులో లింగ సమానత్వం, మానవీయ కోణం ప్రతిబింబించాలని ఐఏఎస్ శ్రీదేవి అధికారులకు సూచించారు. మున్సిపాలిటీలు ఆర్థిక స్వావలంబన సాధిస్తూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా సరికొత్త పథకాలను చేపట్టాలని కోరారు. దీర్ఘకాలిక ప్రణాళిక విధివిధానాల అమలు, ప్రజలతో నిరంతర అనుసంధానంతో పాటు దీర్ఘకాలిక దార్శనికతతో పాలన సాగించాలన్నారు.

మున్సిపల్ చట్టం, నిధుల వినియోగంపై సమగ్ర అవగాహన: ఈ సదస్సులో దాదాపు 60 మందికి పైగా మేయర్లు, చైర్‌పర్సన్లు పాల్గొనగా.. తెలంగాణ మున్సిపల్ చట్టం ప్రకారం వారికున్న అధికారాలు, బాధ్యతలు, విధి నిర్వహణ విధానాలపై నిపుణులు సమగ్ర అవగాహన కల్పించారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పట్టణాభివృద్ధి పథకాలు, నిధుల వినియోగం, ప్రణాళికల రూపకల్పనపై సీనియర్ అధికారులు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు తమ అనుభవాలను పరస్పరం పంచుకున్నారు.

ఈ అవగాహన కార్యక్రమం ద్వారా పట్టణ పాలనలో మరింత సమర్థవంతంగా ముందుకు సాగేందుకు అవసరమైన ఆలోచనా విధానం, నాయకత్వ నైపుణ్యాలు తమకు లభించాయని ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీడీఎంఏ, ఈఎన్‌సీ, డీటీసీపీ, ఎన్ఐయూఎం సంస్థల నుండి పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.