నవదిశ, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో పర్యావరణహిత ప్రజా రవాణాను మరింత బలోపేతం చేసేందుకు గ్రేటర్ ఆర్టీసీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు మార్గాల్లో ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా.. తాజాగా నగరానికి మరో 37 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు చేరుకున్నాయి. వీటిని 5 కీలక మార్గాల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అర్హతలు కలిగిన డ్రైవర్ల లేక ఈ బస్సులు రోడ్డెక్కడం కొంత ఆలస్యమవుతోంది. డ్రైవర్ల మెడికల్, డ్రైవింగ్ సామర్థ్య పరీక్షలు, ట్రయల్ రన్ పూర్తి చేసిన తర్వాతే ఈ వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. కాలుష్య రహిత నగరమే లక్ష్యంగా ఆర్టీసీ కీలక అడుగులు వేస్తోంది.
పర్యావరణహితమైన ప్రజా రవాణాను నగరవాసులకు మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే నగరంలోని పలు కీలక మార్గాల్లో విద్యుత్ బస్సులు విజయవంతంగా నడుస్తుండగా.. ఈ నెట్‌వర్క్‌ను నగరం నలువైపులా విస్తరించాలని ఆర్టీసీ భావిస్తోంది. ఇటీవల కూకట్‌పల్లి డిపో పరిధిలో ప్రారంభించిన 23 ఎలక్ట్రిక్ బస్సులు ప్రస్తుతం ఐదు వేర్వేరు మార్గాల్లో ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. వీటికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో.. తాజాగా మరో 37 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు వచ్చి చేరాయి.
ఎలక్ట్రిక్ బస్సుల డ్రైవర్ ఉద్యోగాల కోసం పెద్ద సంఖ్యలోనే దరఖాస్తులు వస్తున్నప్పటికీ.. అధికారులు ఎంపిక ప్రక్రియలో ఎలాంటి రాజీ పడకుండా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులకు కఠినమైన మెడికల్ టెస్టులు, డ్రైవింగ్ సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ దాటుకుని అర్హత సాధించిన వారికి మాత్రమే ప్రత్యేకంగా ట్రయల్ రన్ నిర్వహించి ఆ తర్వాతే ఈ బస్సులను అప్పగించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. తాజాగా వచ్చిన 37 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కింది 5 ప్రధాన మార్గాల్లో ప్రవేశపెట్టాలని ఆర్టీసీ అధికారులు రూట్ మ్యాప్ సిద్ధం చేశామన్నారు.

