నవదిశ, తెలంగాణ బ్యూరో: ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా, నిక్కచ్చిగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎన్నికల అధికారులను ఆదేశించారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశ మందిరంలో నగరంలోని 15 మంది నియోజకవర్గ ఎన్నికల అధికారులు (ఈఆర్ఓలు), 93 మంది సహాయ ఎన్నికల అధికారులు (ఏఈఆర్ఓలు), 15 మంది జిల్లా శిక్షకులు (డీటీలు), 406 మంది బీఎల్ఓ సూపర్వైజర్లతో ఆయన విస్తృత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఎన్నికల యంత్రాంగానికి ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేస్తూ అవగాహన కల్పించారు. అర్హులైన ఓటర్లందరికీ ఎన్యుమరేషన్ ఫారాలను (ఈఎఫ్) సకాలంలో పంపిణీ చేసి,వాటిని తిరిగి పక్కాగా సేకరించాలని కమిషనర్ స్పష్టం చేశారు.ఫారాల పంపిణీ, సేకరణ, ఓటర్లు అందించిన వివరాల క్షేత్రస్థాయి పరిశీలన ఆ సమాచారాన్ని బీఎల్ఓ యాప్ లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయడం వంటి అంశాలపై అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలను అందించారు.ఈ ప్రక్రియలో పారదర్శకతను పాటిస్తూ, ప్రతి ఓటరునూ చేరడమే లక్ష్యంగా బూత్ స్థాయి ఏజెంట్లతో (బీఎల్ఏ) సమన్వయం చేసుకోవాలని సూచించారు. బీఎల్ఓలు, సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అనుసరించాల్సిన విధులను, నిబంధనలను కమిషనర్ వివరించారు. విధి నిర్వహణలో ఎలాంటి పక్షపాతం లేకుండా,సమాచార నమోదులో ఖచ్చితత్వాన్ని పాటించాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ప్రామాణిక నిబంధనల ప్రకారం, నిర్దేశిత గడువులోగా తమకు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేయాలని ఎన్నికల సిబ్బందికి జిల్లా ఎన్నికల అధికారి ఆదేశించారు.
తెలంగాణ
గ్రేటర్ ఎన్నికల యంత్రాంగానికి రంగం సిద్దం - జిహెచ్ఎంసి

