నవదిశ, తెలంగాణ బ్యూరో: సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టంగా చెప్పారు. గురువారం బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటేరియట్ లో బీసీ, ఎస్సీ, ఎస్సీ డిపార్ట్ మెంట్స్ సమీక్షా సమావేశం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ప్రైవేట్ భవనాల్లో వసతి పొందుతున్న విద్యార్థులను సాధ్యమైనంత మేరకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు మార్చే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలు హాస్టల్లో గురుకులాలలో మరమ్మతు పనులు ఒక నెలలోపు పూర్తి చేయాలని అధికారులను ఉపముఖ్యమంత్రి ఆదేశించారు.
అలాగే 2023 నుంచి పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.7.5 కోట్ల మరమ్మతు బిల్లులను ప్రాధాన్యతతో క్లియర్ చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు ఉప ముఖ్యమంత్రి సూచించారు. సంక్షేమ గురుకులాలు, హాస్టళ్ల రెంట్ ఛార్జీలు, డైట్, కాస్మోటిక్ ఛార్జీలకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ కు పంపాలని ఆయా శాఖ కార్యదర్శులకు ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు సంబంధించిన బిల్లులు ఏ కారణం చేతనైనా పంపక పోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన అధికారులను హెచ్చిరించారు.
స్టడీ సర్కిళ్లను బలోపేతం చేసి, యూపీఎస్సీ, గ్రూప్ సర్వీసులు, ఇతర పోటీ పరీక్షల్లో విజయశాతాన్ని పెంచాలన్నారు. సంక్షేమ శాఖలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అన్ని బిల్లులను సమర్పించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వాటిని వెంటనే ఆర్థిక శాఖ క్లియరెన్స్ చేస్తుందని అన్నారు. అంబేద్కర్ టవర్, బాబూ జగ్జీవన్ రామ్ విద్యార్థి వసతి భవనాల నిర్మాణానికి సంభందించి నెలవారీ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆయన అదేశించారు. బహుళ అంతస్తుల అంబేద్కర్ భవనంను 2027 ఏప్రిల్ 14న ప్రారంభోత్సవం నిర్వహించేలా లక్ష్యంగా పెట్టుకోవాలని అధికారులతో అన్నారు. అన్ని స్వయం ఉపాధి కార్యక్రమాలను రాజీవ్ యువ వికాసం కింద అమలు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రతిపాదిత ఈవీ ద్విచక్ర వాహన పథకంకు సంభందించిన పూర్తి నివేదికను సమర్పించాలన్నారు. మెరుగైన ఆర్థిక ప్రణాళిక కోసం వార్షిక, త్రైమాసిక నిధుల అవసరాలను సమర్పించాలని తెలిపారు.
అన్ని జిల్లాల్లో డా. బి.ఆర్. అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ల స్థాపనకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రభుత్వం వచ్చాక 40 శాతం డైట్ చార్జీలు, 200 శాతం కాస్మొటిక్ చార్జీలు ఒకేసారి పెంచిందని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. పెంచడమే కాకుండా ఆ బిల్లులు అన్ని ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామని ఆయన చెప్పారు. సంక్షేమ శాఖల ఆధ్వర్యంలోని అన్ని విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రజా ప్రభుత్వం సంసిద్దంగా ఉందని అన్నారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, 2014 నుంచి హైదరాబాద్ మినహా జిల్లాల నుంచి 1,810 మంది అభ్యర్థులు స్టడీ సర్కిళ్ల ద్వారా ఎంపిక కావడం విశేషం. కాగా, వీరిలో దాదాపు 1,000 మంది ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంపిక కావడం విశేషం. రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్వహణకు నెలకు రూ.29 కోట్ల నిధుల అవసరం ఉందని అధికారులు ఉప ముఖ్యమంత్రికి తెలిపారు. వివిధ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించిన పెండింగ్ చెల్లింపులు చేయాలని అధికారులు కోరారు. రూ.27 కోట్ల పెండింగ్ అద్దె చెల్లింపులను విడుదల చేయాలని కోరారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ కార్యదర్శి అనిత రామచంద్రన్, ఎస్సీ డెవలప్మెంట్ కార్యదర్శి విజయేంద్ర బొయి, శైలజ తదితరులు పాల్గొన్నారు.

