నవదిశ, తెలంగాణ బ్యూరో: ఎస్టీ రిజర్వేషన్ల కల్పన నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గురువారం గాంధీ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చొరవ వల్లే ఎస్టీ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయని పేర్కొన్నారు. రిజర్వేషన్లు లేకపోతే గిరిజన వర్గాలకు చెందిన ఎంతోమంది ప్రజాప్రతినిధులు, అధికారులు వివిధ హోదాల్లో ఉండే అవకాశం ఉండేదా అనే విషయాన్ని ఆలోచించాలన్నారు.
బంగ్లాదేశ్ ఆవిర్భావంలో ఇందిరా గాంధీ కీలక పాత్ర పోషించారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ద్వారా సోనియా గాంధీ చరిత్ర సృష్టించారని అన్నారు. పేదల సంక్షేమం కోసం ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలను కాంగ్రెస్ తీసుకువచ్చిందని గుర్తు చేశారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆకాంక్ష మేరకు తెలంగాణలో కులగణన నిర్వహించామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభ్యున్నతే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులపై మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు గుప్పించారు. కేటీఆర్, హరీష్ రావు ప్రజల్లో తిరుగుతున్నా బీఆర్‌ఎస్ శకం ముగిసిపోయిందని వ్యాఖ్యానించారు. అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లకు పైగా గెలిచి మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇందిరా గాంధీ జయంతి కార్యక్రమాలు, యాత్రల్లో పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

