తెలంగాణ

చేరికల కోసం జనసేన ‘జాయినింగ్స్ కమిటీ’ ఏర్పాటు!

చేరికల కోసం జనసేన ‘జాయినింగ్స్ కమిటీ’ ఏర్పాటు!

నవదిశ, తెలంగాణ బ్యూరో: ఏపీ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా మారిన జనసేన పార్టీ.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. తెలంగాణలో పార్టీ రాజకీయ కార్యకలాపాలను విస్తృతం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో బలోపేతం కావడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. పార్టీ భావజాలానికి ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి చేరాలనుకునే రాజకీయ నేతలు, విద్యావంతులు, సామాజికవేత్తలు మరియు తటస్థులను ఆహ్వానించడానికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చేరికలను క్రమబద్ధంగా సమన్వయం చేసేందుకు ఏడుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక "తెలంగాణ జాయినింగ్స్ కమిటీ"ని నియమించింది.

ఈ ప్రతిష్టాత్మక కమిటీలో ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర మాజీ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస్, గొట్టిముక్కల నరేష్ రెడ్డి, అబ్దుల్ హనీఫ్, అల్లాడి తనీష్, చిరాగ్ ప్రజీత్ గౌడ్ మరియు తెలంగాణ రాష్ట్ర మాజీ డీసీపీ మేడూరి సరస్వతి సభ్యులుగా వ్యవహరించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి వస్తున్న చేరికల విజ్ఞప్తులను ఈ జాయినింగ్స్ కమిటీ మొదట క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆ తర్వాత ఆ వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి పరిశీలించి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తారు. అనంతరం ఆయన ఇచ్చే దిశా నిర్దేశం, కీలక సూచనల మేరకు తెలంగాణలో భారీ ఎత్తున చేరికల కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించనున్నారు. ఈ తాజా కమిటీ ఏర్పాటుతో తెలంగాణ రాజకీయాల్లో జనసేన స్పీడ్ పెంచిందని స్పష్టమవుతోంది.