తెలంగాణ

రైల్వే వాగన్ డిజైన్ పాలసీలో భారీ సంస్కరణలు

రైల్వే వాగన్ డిజైన్ పాలసీలో భారీ సంస్కరణలు

నవదిశ, తెలంగాణ బ్యూరో: భారతీయ రైల్వే సరుకు రవాణా వ్యవస్థను మరింత ఆధునికంగా, పరిశ్రమలకు అనుకూలంగా తీర్చిదిద్దేందుకు రైల్వే బోర్డు వాగన్ డిజైన్ పాలసీలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

కొత్త వాగన్ డిజైన్ పాలసీ ప్రకారం పరిశ్రమలు తమ అవసరాలకు అనుగుణంగా వాగన్లను రూపొందించుకునే అవకాశం కల్పించనున్నారు. ఉక్కు కాయిల్స్, సిమెంట్, ఉప్పు వంటి వస్తువుల రవాణాకు ప్రత్యేక వాగన్ల రూపకల్పన ద్వారా లోడింగ్, అన్‌లోడింగ్ ప్రక్రియలు సులభతరం అవుతాయని అధికారులు పేర్కొన్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కొత్త వాగన్ డిజైన్ పాలసీని వచ్చే 15 రోజుల్లో విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విధానం ద్వారా వివిధ పరిశ్రమలు తమ సరుకు రవాణా అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక వాగన్లను అభివృద్ధి చేసుకునే అవకాశాలు పెరుగుతాయి. వాగన్ల రూపకల్పన, ప్రోటోటైప్ తయారీ, భద్రతా ప్రమాణాల పరిశీలన బాధ్యతలను ఆర్‌డీఎస్‌ఓ, సీఎస్ఆర్‌ఎస్ సంస్థలు నిర్వహించనున్నాయి. కఠినమైన ప్రమాణాల అమలు ద్వారా అత్యుత్తమ నాణ్యత గల వాగన్ల తయారీకి అవకాశం కలుగుతుందని రైల్వే మంత్రి తెలిపారు.

దేశంలో సరకు రవాణాలో రైల్వేల వాటాను పెంచాలని ప్రధానమంత్రి సూచించిన నేపథ్యంలో ఈ సంస్కరణలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. రోడ్డు రవాణాతో పోలిస్తే రైల్వే రవాణా సుమారు 90 శాతం వరకు పర్యావరణహితమని పేర్కొన్నారు. భారతీయ రైల్వేలు దాదాపు పూర్తి స్థాయిలో విద్యుదీకరణ దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో రైల్వే ఆధారిత సరకు రవాణా పెరగడం వల్ల దిగుమతి డీజిల్‌పై ఆధారపడటం తగ్గడంతో పాటు కార్బన్ ఉద్గారాలు కూడా తగ్గనున్నాయి. దీంతో రవాణా ఖర్చులు తగ్గి, నిత్యావసర వస్తువుల ధరలు కూడా సామాన్యులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ కొత్త వాగన్ డిజైన్ పాలసీతో భారతీయ రైల్వేలు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా, ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇచ్చే ఆధునిక సరకు రవాణా వ్యవస్థగా రూపుదిద్దుకోనున్నాయి.

ఈ సమావేశంలో రైల్వే శాఖ సహాయ మంత్రులు వి. సోమన్న, రవ్నీత్ సింగ్ బిట్టూ, ఆర్‌డీఎస్‌ఓ డైరెక్టర్ జనరల్, రైల్వే బోర్డు సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.