నవదిశ, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అధ్యక్షతన తార్నాకలోని ఎంఎంసి ప్రధాన కార్యాలయంలో మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసి) స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించబడింది. కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో మల్కాజ్‌గిరి నగర సమగ్ర అభివృద్ధి,పౌర సేవలకు సంబంధించిన 13 కీలక అజెండా అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
సమావేశం అనంతరం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అధికారులతో కలిసి పలు కీలక ప్రాజెక్టుల పురోగతి పై సమీక్ష నిర్వహించారు.నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న వేస్ట్ టు వండర్ ప్రాజెక్టు కోసం భూమిని గుర్తించడం, క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ పురోగతి,లేక్ ఎకానమీ కార్యక్రమాల పై ఆయన దిశానిర్దేశం చేశారు.ఇక నిర్మాణ,కూల్చివేత వ్యర్థాల సమర్థవంతమైన నిర్వహణ, క్యూర్-1 అమలు, కార్పొరేషన్ రెవెన్యూ వసూళ్లు, ప్రత్యేక డ్రైవ్‌ల అనంతరం పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాల ప్రస్తుత స్థితిగతుల ను అడిగి తెలుసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా పౌరులతో నిరంతరం అనుసంధానాన్ని కొనసాగించాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ముఖ్యంగా వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలోని 141 నీట మునిగే (వాటర్‌లాగింగ్) ప్రాంతాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జయేష్ రంజన్ ఆదేశించారు. ఈ సమస్యాత్మక ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి అంశంపై కార్యాచరణ ప్రణాళికను వేగవంతం చేయాలని కోరారు.ప్రణాళికా బద్ధమైన కార్యాచరణ,సమర్థవంతమైన పర్యవేక్షణ, వివిధ శాఖల మధ్య సమన్వయంతో మల్కాజిగిరిని పరిశుభ్రమైన, సురక్షితమైన,సుస్థిరమైన నగరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కీలక సమావేశంలో జోనల్ కమిషనర్లు రాధికా గుప్తా, సంచిత్ గంగ్వార్, వికాస్ మహతో, అదనపు కమిషనర్లు రఘుప్రసాద్, వేణు గోపాల్, చీఫ్ ఇంజినీర్ అశోక్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్, పీడీ యూసీడి సురేష్ కుమార్, వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

