నవదిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ క్రికెట్ వర్గాల్లో సుదీర్ఘకాలంగా చర్చనీయాంశంగా మారిన నెపోటిజం, జిల్లా ఆటగాళ్లకు జరుగుతున్న అన్యాయంపై న్యాయపోరాటానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హనుమకొండకు చెందిన యువ క్రికెటర్లు మరింగంటి నవరసన్, విష్ణు దాస్ శశాంక్ కశ్యప్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హనుమకొండ 4వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కీలక చర్యలు చేపట్టింది.పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, భారత క్రికెట్ నియంత్రణ మండలితో పాటు వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్‌కు అత్యవసర నోటీసులు జారీ చేసింది. జిల్లా ఆటగాళ్లకు జరుగుతున్న అన్యాయం, ఎంపికల్లో పక్షపాతంపై మూడు వారాల్లోగా సమగ్ర సమాధానాలతో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను జూలై 17కు వాయిదా వేసింది.
కొందరి చేతుల్లోనే గుత్తాధిపత్యం: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కోర్టు తీసుకున్న ఈ కీలక నిర్ణయంపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.గడిచిన నాలుగు దశాబ్దాలుగా తెలంగాణ క్రికెట్‌ను కొద్దిమంది కుటుంబాలు, వర్గాలు తమ గుత్తాధిపత్యంగా మార్చేశాయని ఆరోపించారు. దీనివల్ల వేలాది మంది ప్రతిభావంతులైన జిల్లా క్రికెటర్ల కలలు ఛిద్రమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు."నెపోటిజం నశించాలి… ప్రతిభకు మాత్రమే న్యాయం జరగాలి" అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ న్యాయపోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, ఇప్పుడు న్యాయస్థానాలే మాకు ఆశాకిరణంగా మారాయని టీసీఏ ప్రతినిధులు పేర్కొన్నారు.
ఇదెలా ఉంటే ఎంతో కాలంగా లోలోపల నలుగుతున్న హెచ్‌సీఏలోని లోపాలపై ఇప్పుడు నేరుగా న్యాయస్థానం జోక్యం చేసుకోవడం రాష్ట్ర క్రికెట్ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. జూలై 17న జరగబోయే తదుపరి విచారణలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని క్రీడాకారులు, క్రీడాభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

