నవదిశ, తెలంగాణ బ్యూరో: కరీంనగర్ జిల్లా భారతరాష్ట్ర సమితికి కంచుకోట అని, రాబోయే రోజుల్లో అక్కడ కారు గుర్తు సునామీ సృష్టించడం ఖాయమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా జిల్లాలోని అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్టీ క్షేత్రస్థాయి బలోపేతం,నేటి రాజకీయాల పై నేతలకు దిశానిర్దేశం చేశారు.
కాంగ్రెస్ పాలన పై విసుగు,కారు వైపు ప్రజల చూపు : గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అడ్డగోలు హామీలు, మోసాల వల్లే దురదృష్టవశాత్తు కొన్ని స్థానాలను కోల్పోవాల్సి వచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు.అయితే, కాంగ్రెస్ పార్టీ రెండున్నర సంవత్సరాల విఫల పరిపాలనను చూసిన తర్వాత ప్రజలు విసిగిపోయారని, తిరిగి బీఆర్ఎస్ వైపు, కేసీఆర్ నాయకత్వం వైపు చూస్తున్నారని తెలిపారు. పార్టీ అంతర్గత సర్వేల్లోనూ కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయబోతున్నట్లు తేలిందని ఆయన వెల్లడించారు. నియోజకవర్గాల వారీగా పార్టీ సభ్యత్వ నమోదు, క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్న కేటీఆర్..అధికారం ఉన్నా లేకున్నా పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టి చూసుకోవాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు.ఇకపై కేవలం గ్రామస్థాయిలోనే కాకుండా, బూత్ ల వారీగా ప్రత్యేక కార్యాచరణతో కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
సింగరేణి పై కాంగ్రెస్ బీజేపీ కుట్రలు: కరీంనగర్ జిల్లాకు జీవనాడి అయిన సింగరేణి సంస్థపై అటు బీజేపీ,ఇటు కాంగ్రెస్ కలిసి చేస్తున్న కుట్రలను, అవినీతిని కార్మికులు, ప్రజల ముందు ఎండగట్టాలని కేటీఆర్ సూచించారు. కాలేశ్వరం ప్రాజెక్టు ప్రతిఫలాలను ప్రజలకు నిరంతరం గుర్తు చేయాల్సిన అవసరం ఉందన్న ఆయన.. కరువు వచ్చినప్పుడే కాలేశ్వరం విలువ తెలుస్తుందని తాము గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు అక్షరాలా నిజమవుతున్నాయన్నారు.వర్షాలు పడకపోయినా కాలేశ్వరం ప్రాజెక్టులో పుష్కలంగా నీరున్నా..దాన్ని ఎత్తిపోసి రైతన్నల నారుమడులకు అందించాలన్న కనీస సోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోవడం,వారి రైతు వ్యతిరేక విధానానికి అద్దం పడుతోందని మండిపడ్డారు.రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు అందినకాడికి దోచుకుంటున్నారని, వారి స్థానిక అరాచకాలను, అవినీతిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. కాలంతో పాటు మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ,సామాజిక మాధ్యమాలను ఉపయోగించి ప్రజల మనసులను గెలుచుకోవాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

