నవదిశ, తెలంగాణ బ్యూరో : క్రీడల పట్ల ఆసక్తి, ఆరోగ్యవంతమయిన సమాజానికి ఒలంపిక్ డే రన్ నిర్వహించామని రాష్ర్ట క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఒలింపిక్ డే రన్ 2026 లో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరం నలుమూలల నుండి ఒలింపిక్ జ్యోతిని తీసుకువచ్చిన ప్రతి ఒక్క క్రీడాకారుడికి అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరిలో ఒలంపిక్ స్ఫూర్తిని నింపేలా ప్రపంచవ్యాప్తంగా ప్రతీ సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. క్రమశిక్షణ తో కూడిన క్రీడాకారులే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని, రేవంత్ రెడ్డి సీఎం గా బాధ్యతలు చేపట్టిన రెండున్నర ఏళ్ల కాలంలోనే గతంలో ఎన్నడూ లేనివిధంగా క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తూ పలు కార్యక్రమాలను దిగ్విజయవంతంగా నిర్వహించినట్లు మంత్రి గుర్తు చేశారు. 2036 ఒలంపిక్స్ లో తెలంగాణ క్రీడాకారులు పతకాలు సాధించే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు.ఈ దిశగా గ్రామీణ స్థాయి క్రీడాకారులను వెలికి తీసే ఉద్దేశంతో సీఎం కప్ రెండు ఎడిషన్ లను విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు.
ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించడం కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ ఒలింపిక్ డే ఇచ్చే క్రీడా స్ఫూర్తిని మరింత విస్తృత పరిచే దిశగా పయనించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు జితేందర్ రెడ్డి, సాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు.

