నవదిశ, తెలంగాణ బ్యూరో: తపాలా సేవలకు సంబంధించిన ప్రజల ఫిర్యాదులు, సమస్యల పరిష్కారానికి హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజన్ పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో డివిజనల్ స్థాయి డాక్ అదాలత్ నిర్వహించనున్నట్లు పోస్ట్ ఆఫీస్ సీనియర్ సూపరింటెండెంట్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ డాక్ అదాలత్ జూన్ 30, 2026న మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ జీపీఓ భవనంలోని మొదటి అంతస్తులో ఉన్న సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ కార్యాలయంలో నిర్వహించబడుతుందన్నారు. హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజన్ పరిధిలోని తపాలా సేవలకు సంబంధించిన ఫిర్యాదులు, సమస్యలు ఉన్న ప్రజలు తమ వినతులను జూన్ 29, 2026లోపు “ది సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్, హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజన్, ఫస్ట్ ఫ్లోర్, జీపీఓ బిల్డింగ్, హైదరాబాద్–500001” చిరునామాకు పంపాలని సూచించారు.
పంపే లేఖలపై, కవర్లపై “DIVISIONAL LEVEL DAK ADALAT” అని తప్పనిసరిగా పేర్కొనాలని తెలిపారు. అలాగే ఫిర్యాదులను dohyderabadsoutheast.ap@indiapost.gov.in లేదా ssphse2005@gmail.com ఇ-మెయిల్ చిరునామాలకు కూడా పంపవచ్చని అధికారులు వెల్లడించారు. ప్రజలకు తపాలా సేవలపై ఉన్న సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ఈ డాక్ అదాలత్ వేదికగా ఉపయోగపడుతుందని పోస్టల్ శాఖ పేర్కొంది.

